దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ తరహాలో దేశ రాజధాని ఢిల్లీ కూడా అతి పెద్ద షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు రంగం సిద్ధం అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ షాపింగ్ ఫెస్టివల్ 30 రోజుల పాటు కొనసాగనుంది. 2023 జనవరి 28న ప్రారంభం అయ్యే షాపింగ్ పెస్టివల్ ఫిబ్రవరి 26న ముగుస్తుందని తెలిపారు. ఈ షాపింగ్ ఫెస్టివల్ సమయంలో భారీ ఎత్తున డిస్కౌంట్స్ ఉంటాయన్నారు. నగరాన్ని ఈ సందర్భంగా ప్రత్యేకంగా..ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఇది ప్రపంచంలోనే అతి పెద్ద షాపింగ్ ఫెస్టివల్ గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా దీనికి సంబంధించి ప్లానింగ్ సాగిందని..ఇది పూర్తవటంతో ఇప్పుడు ఈ విషయాలు బహిర్గతం చేస్తున్నట్లు తెలిపారు. షాపింగ్ ఫెస్టివల్ ప్రారంభం రోజు..ముగింపు రోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఇప్పటి వరకూ దేశంలో ఇంత భారీ షాపింగ్ ఫెస్టివల్ జరిగి ఉండదని..ఢిల్లీ నగర వాసులతోపాటు దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఈ షాపింగ్ ఫెస్టివల్ కు హాజరై ప్రత్యేక అనుభూతులు పొంద వచ్చన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు చెందిన ఆహారం ఆ సమయంలో అందుబాటులో ఉంటుందని..సాంస్కృతిక కార్యక్రమాలతో యువత, ఫ్యామిలీలు, సంపన్నుల దగ్గర నుంచి మధ్య తరగతి, సామాన్య ప్రజలను కూడా గమనంలోకి తీసుకుని కార్యక్రమాలు తలపెడుతున్నామని..దీనికి అందరూ సిద్ధం కావాలన్నారు. ఈ షాపింగ్ ఫెస్టివల్ తో ఢిల్లీ ఆర్ధిక వ్యవస్థకు మరింత ఊపు రావటంతో పాటు..యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెద్ద ఎత్తున వస్తాయన్నారు. షాపింగ్ ఫెస్టివల్ సమయంలో ప్రత్యేక ప్యాకేజీలు ఆఫర్ చేసేలా ఎయిర్ లైన్స్, ట్రావెల్ ఏజెంట్లు అందరితో చర్చిస్తున్నామని కేజ్రీవాల్ వెల్లడించారు.