బాలీవుడ్ నటి జూహ్లి చావ్లా చిక్కుల్లో పడ్డారు. 5జీ సర్వీసులకు సంబంధించి ఆమె ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటీషన్ దీనికి కారణం అయింది. ఈ పిటీషన్ ను కొట్టేసిన హైకోర్టు..ఇది కేవలం ప్రచారం కోసం చేసిన పనిగా అభివర్ణించింది. అంతే కాదు..జూహ్లిచావ్లాతోపాటు పిటీషనర్లకు 20 లక్షల రూపాయల జరిమానా విధించింది. పిటీషన్ దారులు న్యాయపక్రియను అపహస్యం చేసేలా వ్యవహరించారని మండిపడింది. కోర్టు వాదనల లింక్ ను జూహ్లి చావ్లా సోషల్ మీడియాలో షేర్ చేయటంపైనా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
5జీ సర్వీసుల ప్రారంభానికి సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత శాఖకు కనీసం ఫిర్యాదు కూడా చేయకుండా నేరుగా కోర్టును ఆశ్రయించటాన్ని కూడా కోర్టు తప్పుపట్టింది. ఈ కేసులో విచారణ జరుగుతున్న సమయంలో కొంత మంది జూహ్లి చావ్లా సినిమాలకు సంబంధించిన పాటలు పాడటంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి కారకులైన వారు ఎవరో గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టు ముందే ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం నాడు ఆమె పిటీషన్ ను కొట్టేస్తూ...జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.