
ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకున్న ‘చెత్త పన్ను’ నిర్ణయం రాజకీయంగా ఎంత పెద్ద దుమారం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఇదే అదనుగా ప్రతిపక్షంలో ఉండగా తెలుగు దేశంతో పాటు జనసేన లు అప్పటి సర్కారుపై..ముఖ్యంగా మాజీ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో జగన్ ఓటమికి ఇది కూడా ఒక కారణం అని నమ్మేవాళ్ళు వైసీపీ లోనే చాలా మంది ఉన్నారు. ఈ పన్ను ద్వారా వచ్చే ఆదాయం కంటే చెత్త పన్ను అనే ప్రచారం వల్ల జరిగే డ్యామేజ్ ఎంతో ఎక్కువగా ఉంది అన్నది వైసీపీ నేతలు అంచనా కూడా ఉంది. ఇప్పుడు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జగన్ మోడల్ ను ఫాలో కావాలని నిర్ణయం తీసుకుంది.
అందులో భాగంగా ఇప్పుడు బెంగళూరు లో చెత్త పన్ను వేయటానికి సిద్ధం అయ్యారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే ఈ ఏప్రిల్ నుంచే అక్కడ చెత్త పన్ను అమల్లోకి రానుంది. అయితే ఇంటి విస్తీర్ణం ఆధారంగా ఈ పన్ను ని ఫిక్స్ చేశారు. ఆరు వందల చదరపు అడుగులు లోపు ఇళ్ల వాళ్ళు నెలకు పది రూపాయలు, 600 నుంచి 1000 చదరపు అడుగుల ఇల్లు ఉన్న వాళ్ళు 50 రూపాయలు, 3000 చదరపు అడుగుల ఇల్లు ఉన్న వాళ్ళు 200 రూపాయలు, గరిష్టంగా అంటే 4000 చదరపు అడుగుల ఇల్లు ఉన్న వాళ్ళు నెలకు 400 రూపాయల చెత్త పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
ఈ మేరకు బెంగుళూరు మహానగర పాలిక నిర్ణయం తీసుకుంది. నగరంలోని హోటల్స్ గతంలో చెత్తకు కేజికి ఐదు రూపాయలు చెల్లించే వాళ్ళు. ఇప్పుడు దీన్ని కేజీకి పన్నెండు రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ చెత్త పన్ను నిర్ణయాన్ని ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా తప్పుపడుతూ ప్రభుత్వం పై విమర్శలు చేసింది. బెంగళూరు నగరాన్ని మరింత సురక్షితంగా మార్చేందుకు ఏఐ ఆధారిత సేఫ్ సిటీ కెమెరాలు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. చెత్త పన్ను ద్వారా బెంగళూరు నుంచి ప్రభుత్వానికి ఏటా ఆరు వందల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంది అని చెపుతున్నారు.