ఎన్నికల బడ్జెట్ ఇది. దేశమంతటినీ ఓకేలా చూడాల్సిన కేంద్రం ఎన్నికలు ఉన్న రాష్ట్రాలపై మాత్రం ప్రత్యేక ప్రేమ చూపించింది. తర్వాత అమలు ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్పటం కష్టం అయినా సరే కేటాయింపుల్లో మాత్రం ఆ తేడా స్పష్టంగా చూపించారు. త్వరలో ఎన్నికలు జరగనున్న కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సోంలకు బడ్జెట్ లో ప్రాధాన్యం కల్పించారు. అసోం, కేరళ, బెంగాల్ లో ఐదు ప్రత్యేక జాతీయ రహదారుల అభివృద్ధికి ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. బెంగాల్ లో 675 కిలోమీటర్ల జాతీయ రహదారులను అభివృద్ధ చేయనున్నారు.
2022 జూన్ నాటికి తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరకు రవాణా కారిడార్లు కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఖరగ్ పూర్-విజయవాడ మధ్య ఈస్ట్ కోస్ట్ సరకు రవాణా కారిడార్ ఏర్పాటు కానుంది. మెట్రో రైలు ప్రాజెక్టుల విషయంలోనూ అదే వివక్ష చూపించారు. తెలుగు రాష్ట్రాల మెట్రోలకు మాత్రం మొండిచేయి చూపించారు. చెన్నయ్ మెట్రోకు 63 వేల కోట్లు, 18 వేల కోట్లతో బస్‌ట్రాన్స్ పోర్ట్ పథకం, మెట్రో లైట్, మెట్రో నియో పథకాలు, కొచ్చి మెట్రో రెండో దశకు కేంద్రం సాయం, బెంగళూరు మెట్రోకు 14 వేల 788కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.