విదేశీ పర్యటనలకు వెళ్ళాలనుకునేవారితోపాటు విద్యార్ధులకు గుడ్ న్యూస్. పలు దేశాలు బూస్టర్ డోస్ ను తప్పనిసరి చేశాయి. బూస్టర్ డోస్ వేసుకున్న వారినే తమ దేశంలోకి అనుమతిస్తామని ప్రకటిస్తున్నాయి. దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రెండవ డోసు తీసుకున్న తొమ్మిది నెలల తర్వాతే భారత్ లో బూస్టర్ (ప్రికాషన్) డోసుకు అనుమతిస్తున్నారు. ఇప్పుడు ఈ పరిమితిని మూడు నెలలకు తగ్గించారు. ఇతర దేశాలు విధించిన నిబంధనలు అనుసరించేందుకు వీలుగా కేంద్రం ఈ మార్పులు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్షుక్ మాండవీయ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఈ మేరకు కోవిన్ యాప్ లో..పోర్టల్ లో మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పలు దేశాలు బూస్టర్ డోస్ తప్పనిసరి చేసిన పరిస్థితుల్లో ఈ మేరకు మార్పులు చేశారు. ముఖ్యంగా యూరోపియన్ దేశాలు బూస్టర్ డోస్ కోసం పట్టుబడుతున్నాయి. బూస్టర్ డోస్ వ్యవధిని తగ్గించటం వల్ల ఈ కార్యక్రమంలో వేగం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. వాస్తవానికి కొద్ది రోజుల క్రితం సీరమ్ ఇన్ స్టటిట్యూబ్ సీఈవో అదర్ పూనావాలా ప్రికాషన్ డోస్ గడువును తొమ్మిది నెలల నుంచి ఆరు నెలలకు తగ్గించాలని కోరారు. ఆ సమయంలో కేంద్రం ఈ వినతిని తోసిపుచ్చింది.