ఢిల్లీలో పేలుడు కలకలం

Update: 2021-01-29 15:40 GMT

ఓ వైపు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం. మరో వైపు గణతంత్ర దినోత్సవం ముగింపు కార్యక్రమంగా నిర్వహించే బీటింగ్ రిట్రీట్. రాష్ట్రపతి,, ఉప రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రుల వంటి వివిఐపిలు హాజరైన ప్రాంతానికి అతి చేరువలో బాంబు పేలుడు షాక్ కు గురిచేసింది. ఢిల్లీలోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయ సమీపంలో శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఈ పేలుడు చోటుచేసుకుంది. ఈ పేలుడు దాటికి మూడు కార్లు ధ్వంసం కాగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పేలుడు ధాటికి సంఘ‌ట‌నాస్థ‌లంలో మూడు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ పేలుడులో ఎవరూ గాయపడలేదని పోలీసులు వెల్లడించారు. పూల‌కుండిలో పేలుడు సంభవించిన‌ట్లుగా అధికారులు తెలిపారు. పేలుడుకు ఐఈడీ ఉప‌యోగించిన‌ట్లుగా నిర్ధార‌ణకు వ‌చ్చారు. ఇజ్రాయిల్‌ రాయబార కార్యాలయం వద్ద భారీగా భద్రతను పెంచారు. దేశ వ్యాప్తంగా అన్ని ఎయిర్‌పోర్టుల్లో హై అలర్ట్‌ జారీ చేశారు. పార్లమెంట్‌ సహా ఢిల్లీలోని అన్ని కార్యాలయాల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. మరోవైపు పేలుడు ఘటన నేపథ్యంలో హోంశాఖ మంత్రి అమిత్‌షా సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News