అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కు బిగ్ షాక్. ఆయన నోబెల్ శాంతి బహుమతి ఆశలు గల్లంతు అయ్యాయి. ప్రపంచంలో ఎన్నో యుద్దాలు అపానని...తద్వారా ఎంతో మంది ప్రజల ప్రాణాలు కాపాడిన తనకు కాకుండా ఈ బహుమతి అర్హత ఇంకెవరికి ఉంది అన్న తరహాలో ఆయన గత కొన్ని రోజులుగా ప్రకటించుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. నోబెల్ పీస్ ప్రైజ్ ప్రకటన వచ్చేసింది. డోనాల్డ్ ట్రంప్ కు నిరాశే మిగిలింది. 2025 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతి వెనెజులాకు చెందిన మరియా కొరీనా మచాడో కు దక్కింది. ఈ విషయాన్నీ నార్వే నోబెల్ కమిటీ శుక్రవారం నాడు అధికారికంగా వెల్లడించింది. వెనెజులా ప్రజల హక్కుల కోసం మరియా కొరీనా అవిశ్రాంతంగా పోరాడారు అని..నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యం కోసం ఆమె చేసిన పోరాటాన్ని గుర్తించి ఆమెకు ఈ బహుమతి ప్రకటించినట్లు తెలిపారు.
ఈ పోరాటంలో ఆమె ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని..ఏడాదికాలంగా అజ్ఞాతంలో ఉన్నారన్నారు. ప్రస్తుతం ఆమె వెనెజులా పార్లమెంట్ సభ్యురాలిగా...ఆ దేశ ప్రతిపక్ష నేత గా ఉన్నారు. ఈ ఏడాది నోబెల్ పురస్కారానికి మొత్తం 338 మంది నామినేట్ అయితే కమిటీ మరియా వైపు మొగ్గు చూపటంతో ఆమె ఈ ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. శాంతియుత మార్గంలో ఆమె ప్రజాస్వామ్యం కోసం పోరాడి ఎంతో మందికి ఆమె స్ఫూర్తిగా నిలిచారు అని కమిటీ వెల్లడించింది. నోబెల్ శాంతి బహుమతి ప్రకటన వెలువడటానికి కొన్ని గంటల ముందు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అదేంటి అంటే రష్యా కూడా డోనాల్డ్ ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి అభ్యర్థిత్వానికి తాము మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. అందరిని బెదిరిస్తున్న తరహాలోనే డోనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి ప్రకటించే కమిటీ ని కూడా బెదిరించేలా వ్యాఖ్యానించినట్లు మీడియా లో వార్తలు వచ్చాయి. అయినా కూడా డోనాల్డ్ ట్రంప్ కు ఈ సారి ఫలితం దక్కలేదు.
అయితే ఈ సంవత్సరం రాకపోయినా కూడా వచ్చే ఏడాది అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కు ఈ అవార్డు వచ్చే అవకాశాలను తోసిపుచ్చలేమనే అంచనాలు కూడా ఉన్నాయి. డోనాల్డ్ ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పాకిస్థాన్ తొలుత అధికారికంగా ప్రతిపాదించింది. తర్వాత ఇజ్రాయిల్ కూడా ఇదే బాటలో పయనించింది. ఎవరూ ఊహించని రీతిలో చివరి నిమిషంలో రష్యా కూడా డోనాల్డ్ ట్రంప్ కు అనుకూలంగా ప్రకటన చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. నోబెల్ శాంతి బహుమతి కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్న డోనాల్డ్ ట్రంప్ కు ఈ ఏడాది చుక్కెదురు కావటంతో రాబోయే రోజుల్లో ఆయన ఇంకెలా వ్యవహరిస్తారో అన్న భయాలు కూడా చాలా మందిలో ఉన్నాయి.