భారత్ బయోటెక్ దేశీయంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ 'కోవాగ్జిన్'కు సంబంధించి కీలక విషయం వెల్లడైంది. అదేంటి అంటే ఎవరికైనా కోవాగ్జిన్ వ్యాక్సిన్ వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తే వారికి కంపెనీ నష్టపరిహారం చెల్లిస్తుంది. అంతే కాదు..వారి వైద్యానికి అయ్యే ఖర్చును కూడా కంపెనీనే భరిస్తుంది. అయితే ఈ అనారోగ్యం కోవాగ్జిన్ వ్యాక్సిన్ వల్లే వచ్చినట్లు తేలాల్సి ఉంటుందని పేర్కొంది. కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకునే వారు సమ్మతి పత్రం అందజేయాల్సి ఉంటుంది. అందులోనే ఈ విషయాన్ని పేర్కొంది. అదే ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనెకాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ కు మాత్రం ఎలాంటి సమ్మతిపత్రం అవసరం లేకుండానే నేరుగానే ఇచ్చేస్తున్నారు. కోవాగ్జిన్ ఇప్పటికి రెండు దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకోగా..అందులో సానుకూల ఫలితాలు వచ్చాయని తెలిపారు.
అందుకే దేశంలోని నియంత్రణా సంస్థలు కోవాగ్జిన్ కు అత్యవసర వినియోగ అనుమతి మంజూరు చేసినట్లు చెబుతున్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో ఇంకా కోవాగ్జిన్ మూడవ దశ క్లినికల్ ప్రయోగాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన ఫలితాలు రావటానికి కొంత సమయం పడుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్ లో శనివారం నాడు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్రమోడీ వర్చువల్ మార్గంలో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి విడతలో కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు మాత్రం వ్యాక్సిన్ ఇస్తున్నారు.