ఏపీ, తెలంగాణ హైకోర్టు సీజెలు బదిలీ

Update: 2020-12-16 11:44 GMT

సుప్రీంకోర్టు కొలిజీయం దేశంలోని పలు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను బదిలీలకు సిఫారసు చేసింది. అందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కూడా ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ఆర్ ఎస్ ఛౌహన్ ను ఉత్తరాఖండ్ హైకోర్టుకు బదిలీ చేశారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జె కె మహేశ్వరిని సిక్కిం హైకోర్టుకు బదిలీ చేశారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు మరి కొంత న్యాయమూర్తులపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొద్దిరోజుల క్రితమే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోడ్డేకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

ఈ వ్యవహారం దేశంలోనే పెద్ద దుమారం రేపింది. అంతే కాకుండా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బదిలీ జరగటం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక్కరినే కాకుండా పలు రాష్ట్రాలకు చెందిన న్యాయమూర్తులను బదిలీ చేస్తూ ఈ నెల 14న సుప్రీంకోర్టు కొలిజీయం నిర్ణయం తీసుకుంది. వీటిని రాష్ట్రపతి ఆమోదించిన వెంటనే ఇవి అమల్లోకి వస్తాయి. ప్రస్తుతం సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ఏ కె గోస్వామిని ఏపీ హైకోర్టుకు బదిలీ చేశారు. ప్రస్తుతం ఢి్లీ, హర్యానా హైకోర్టులో ఉన్న హిమా కొహ్లిని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సిఫారసు చేశారు. 

Tags:    

Similar News