వ్యాక్సినేషన్ విషయంలో మోడల్ మార్చిన అమెరికా
వ్యాక్సినేషన్ విషయంలో అమెరికా మోడల్ మార్చింది. ప్రభుత్వం ఎంత చెప్పినా..ఎన్ని ఆఫర్లు ప్రకటించినా చాలా మంది వ్యాక్సిన్ వైపు చూడటం లేదు. ఎక్కడైతే వ్యాక్సినేషన్ ప్రక్రియ ఏ మాత్రం ముందుకు సాగటం లేదో ఆయా రాష్ట్రాల్లోనే కొత్త కరోనా కేసులు భారీ ఎత్తున వెలుగు చూస్తున్నాయి. అకస్మాత్తుగా అమెరికాలో కేసులు పెరుగుతుండటంతో సెప్టెంబర్, అక్టోబర్ నుంచి నేరుగా ఆఫీసుల్లో కార్యకలాపాలు ప్రారంభించాలని యోచిస్తున్న పెద్ద కంపెనీలకు ఇది ఊహించని పరిణామంగా మారింది. ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే అని ఒత్తిడి చేయలేదు. దీంతో ఇప్పుడు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. అమెరికాలోని అగ్రశ్రేణి కంపెనీలతోపాటు చివరకు రెస్టారెంట్లు కూడా తమ ప్రాంగణంలోకి అడుగుపెట్టాలంటే వ్యాక్సిన్ తీసుకుని ఉండాలనే షరతులు పెడుతున్నాయి. దీంతో చాలా కాలం మందగమనంతో సాగిన వ్యాక్సినేషన్ ప్రక్రియ మళ్ళీ కాస్త పుంజుకుంటోంది. తాజాగా కరోనా కేసులు పెరగటంతో అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) కేసులు ఎక్కువ ఉన్న చోట మాస్క్ లు తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించింది ఈ మధ్యే. వ్యాక్సిన్ వేసుకుని ఉద్యోగులుపై కార్పొరేట్ అమెరికా ఆగ్రహంగా ఉంది. అమెరికాలోని ప్రముఖ సంస్థలైన డిస్నీ, వాల్ మార్ట్, గూగుల్ తమ ఉద్యోగులకు వ్యాక్సిన్ తప్పనిసరి చేసింది. దీంతో ఆయా సంస్థల్లోని ఉద్యోగులు అంతా వ్యక్తిగత ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా వ్యాక్సిన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
అమెరికాలోని పలు రెస్టారెంట్లు తమ కస్టమర్లు వ్యాక్సిన్ తీసుకున్నట్లు ఆధారాలు చూపిస్తే తప్ప..ఎలాంటి ఆహారం సరఫరా చేయబోమని ప్రకటించాయి. అగ్రశ్రేణి సంస్థలే కాకుండా అమెరికా కంపెనీలు అన్నీ వ్యాక్సిన్ ను తప్పనిసరి చేస్తూ వరసగా ప్రకటనలు చేస్తున్నాయి. అమెరికాలో వ్యాక్సిన్లు సరిపడినన్ని ఉన్నా అక్కడ ప్రజల్లో వీటిపై పలు సందేహలు ఉండటంతో వ్యాక్సిన్లు తీసుకోవటానికి ముందుకు రావటంలేదు. దీంతోపాటు వేసవిలో చాలా మంది పెద్ద ఎత్తున విహారయాత్రలకు వెళ్ళటం కూడా తాజాగా కేసులు పెరుగుదలకు కారణం అయిందని నివేదికలు చెబుతున్నాయి. ఎవరైనా వ్యాక్సిన్ తీసుకోవటానికి ఆరోగ్య కారణాలను సాకుగా చూపిస్తే అలాంటి వారి విషయంలో కూడా వైద్య నిపుణులతో పరిస్థితిని మదింపు చేసి అలాంటి వారి విషయంలో నిర్ణయం తీసుకుంటామని ఫేస్ బుక్ తెలిపింది. అమెరికాలోని ప్రముఖ పత్రిక వాషింగ్టన్ పోస్ట్ కూడా ప్రస్తుత ఉద్యోగులతోపాటు కొత్తగా తీసుకోబోయేవారు కూడా విధిగా వ్యాక్సిన్ తీసుకోవాల్సిందేనని పేర్కొంది.