మెగా ఐపీఓలు అన్ని లాభాలు తెచ్చిపెట్టవు!

Update: 2024-10-09 12:35 GMT

Full Viewపెద్ద ఐపీఓలు ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తాయా?. గత మెగా ఐపీఓల విషయంలో ఏమి జరిగింది. ఇప్పుడు దక్షిణ కొరియా కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ హ్యుండయ్ కి చెందిన భారత అనుబంధ సంస్థ హ్యుండయ్ మోటార్ ఇండియా దేశ చరిత్రలోనే అతి పెద్ద ఐపీఓ కు వస్తుండటంతో మరో సారి ఈ చర్చ తెరమీదకు వచ్చింది. హ్యుండయ్ మోటార్ అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 17 మధ్య కాలంలో అంటే కేవలం మూడు రోజుల్లోనే ఇండియన్ మార్కెట్ నుంచి ఏకంగా 27870 రూపాయలు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ తరుణంలో గతంలో వచ్చిన మెగా ఐపీఓల నుంచి ఇన్వెస్టర్లకు దక్కిన ప్రతిఫలం ఎలా ఉందో ఒక సారి చూద్దాం. ఇండియాలో ఇప్పటి వరకు వచ్చిన అతి పెద్ద ఐపీఓ లు అంటే ఎల్ఐసి ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. త్వరలోనే ఈ ప్లేస్ ను హ్యుండయ్ మోటార్ ఆక్రమించబోతుంది. ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసి 2022 మేలో ప్రైమరీ మార్కెట్ నుంచి 21000 వేల కోట్ల రూపాయలు సమీకరించింది. ఒక్కో షేర్ ను 949 రూపాయల ధరతో ఇన్వెస్టర్లకు అలాట్ చేశారు . ఎల్ఐసి అతి పెద్ద ఐపీఓ తో మార్కెట్ లోకి వచ్చినా చాలా రోజులు ఆఫర్ ధర కంటే తక్కువ ధరకే ఈ షేర్లు ట్రేడ్ అయ్యాయి.

                                                                             ఎల్ఐసి షేర్ 52 వారాల గరిష్ట ధర 1221 రూపాయలు అయితే...కనిష్ట ధర 597 రూపాయలు. అంటే చాలా కాలం ఎల్ఐసి లో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు టెన్షన్ పడ్డారు అనే చెప్పాలి. బుధవారం నాడు ఎల్ఐసి షేర్ 970 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. ఎల్ఐసి తర్వాత రెండవ పెద్ద ఐపీఓ పేటిఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ ది. ఈ కంపెనీ 2021 నవంబర్ లో మార్కెట్ లోకి వచ్చి 18300 రూపాయలు సమీకరించింది. పేటిఎం ఒక్కో షేర్ ను 2150 రూపాయలతో జారీ చేసింది. ఈ ఇష్యూ వచ్చి మూడేళ్లు అవుతున్న కూడా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పేటిఎం షేర్లు ఆఫర్ ధరను టచ్ చేయలేదు కదా...ఈ షేర్ 310 రూపాయల కనిష్ట స్థాయిని తాకింది. ఈ షేర్ 52 వారాల గరిష్ట స్థాయి 998 రూపాయలు మాత్రమే. వీటి తర్వాత పెద్ద ఐపీఓ లు అంటే కోల్ ఇండియా మార్కెట్ నుంచి 15119 రూపాయలు, రిలయన్స్ పవర్ 11563 కోట్ల రూపాయలు సేకరించాయి. కోల్ ఇండియా ఇన్వెస్టర్లకు లాభాలు వచ్చినా కూడా రిలయన్స్ పవర్ లో పెట్టుబడి పెట్టిన మదుపరులు భారీగా నష్టపోయారు.

                                                                   2010 లో ఐపీఓ కి వచ్చిన కోల్ ఇండియా ఆఫర్ ధర 245 రూపాయలు అయితే ప్రస్తుతం ఈ షేర్లు 487 రూపాయల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. రిలయన్స్ పవర్ ఆఫర్ ప్రైస్ 450 రూపాయలు అయితే..ఇప్పుడు ఈ షేర్లు కేవలం 48 రూపాయల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. రిలయన్స్ పవర్ 2008 ఫిబ్రవరి లో మార్కెట్ లోకి వచ్చింది. ఇందులో పెట్టుబడి పెట్టిన మదుపరులు భారీగా నష్టపోయారు. కాకపోతే 2021 జులై లో జొమాటో మార్కెట్ నుంచి 9375 సమీకరించింది ఈ కంపెనీ ఒక్కో షేర్ ను 76 రూపాయలకు జారీ చేయగా..ప్రస్తుతం ఈ షేర్లు 280 రూపాయల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఈ లెక్కన జొమాటో మాత్రం ఇన్వెస్టర్లకు మంచి లాభాలు ఇచ్చినట్లే లెక్క. మరి ఇప్పుడు అతి పెద్ద ఐపీఓ తో రాబోతున్న హ్యుండయ్ ఇండియా మోటార్స్ మదుపరులకు ఎలాంటి రిటర్న్స్ ఇస్తుందో వేచిచూడాలి.

Tags:    

Similar News