మరో ప్రముఖ సంస్థ ఐపీవో కు సిద్ధం అయింది. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ కు చెందిన ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఐపీఓ అక్టోబర్ 25 న ప్రారంభం కానుంది. ఈ ఇష్యూ అక్టోబర్ 29 న ముగుస్తుంది. కంపెనీ తాజాగా షేర్ ఆఫర్ ధరను నిర్ణయించింది. పది రూపాయల ముఖ విలువ గల షేర్లను 440 -463 రూపాయలుగా నిర్ణయించింది. ఈ ఐపీవో ద్వారా కంపెనీ మార్కెట్ నుంచి 5430 కోట్ల రూపాయల సమీకరిస్తోంది. ఒక్కో లాట్ సైజు ను 32 షేర్లుగా నిర్ణయించారు. ఈ ఐపీవో ద్వారా 2 .7 కోట్ల కొత్త షేర్లు జారీ చేసి 1250 కోట్ల రూపాయలు....ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద 9. 03 కోట్ల షేర్లు జారీ చేసి 4180 కోట్ల రూపాయలు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఓఎఫ్ఎస్ కింద జారీ చేసే షేర్ల మొత్తం కంపెనీ చేతికి రావు. ఇవి మొత్తం మాతృ సంస్థ గోస్వామి ఇన్ ఫ్రాటెక్ కు వెళ్తాయి. కొత్తగా జారీ చేసే షేర్స్ ద్వారా వచ్చే మొత్తాలను నిర్మాణ అవసరాలకు ఉపయోగపడే పరికరాల కొనుగోలుతో పాటు దీర్ఘకాలిక మూలధన అవసరాలకు ఉపయోగించనున్నారు. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన అతి పెద్ద ఐపీఓ హ్యుండయ్ మోటార్ ఇండియా అతి కష్టం మీద బయటపడిన విషయం తెలిసిందే.
అయినా కూడా రిటైల్ ఇన్వెస్టర్ల పోర్షన్ కేవలం 50 శాతం మాత్రం సబ్ స్క్రైబ్ అయిన సంగతి తెలిసిందే. మంగళవారం నాడు అంటే అక్టోబర్ 22 న హ్యుండయ్ మోటార్ షేర్లు బిఎస్ఈ, ఎన్ఎస్ఈ ల్లో లిస్ట్ కానున్నాయి. మార్కెట్ సెంటిమెంట్ ఒకింత బలహీనంగా ఉన్న తరుణంలో ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐపీవో కు ఎలాంటి స్పందన దక్కుతుందో చూడాలి. అయితే ప్రముఖ గ్రూప్ షాపూర్జీ పల్లోంజీ కి చెందిన కంపెనీ కావటంతో ఐపీవో సక్సెస్ కు డోకా ఉండదు అనే అభిప్రాయం మార్కెట్ లో ఉంది.