కేంద్రం కొత్తగా ప్రైవేట్ పరం చేయనున్న విమానాశ్రయాల రేస్ లో తాము ఉన్నట్లు అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని అదానీ ఎయిర్ పోర్ట్స్ సీఈఓ అరుణ్ బన్సల్ వెల్లడించారు. కేంద్రం రాబోయే రోజుల్లో మరో 11 విమానాశ్రయాలను లీజ్ కు ఇవ్వాలని నిర్ణయించింది. వీటి బిడ్డింగ్ లో తాము పాల్గొంటామని..కొత్త విమానాశ్రయాలు దక్కించుకునే విషయంలో తాము చాలా ఉత్సాహంగా ఉన్నామని తెలిపారు.ప్రస్తుతం అదానీ ఎయిర్ పోర్ట్స్ ఆదీనంలో ఉన్న లక్నో, అహ్మదాబాద్ విమానాశ్రయాలు తాజాగా ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయం అవార్డ్స్ దక్కించుకున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ అరుణ్ బన్సల్ ఈ విషయం వెల్లడించారు. అదానీ ఎయిర్ పోర్ట్స్ ప్రస్తుతం దేశంలో మొత్తం ఏడు విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. కొత్తగా లీజ్ కు ఇచ్చే విమానాశ్రయాలను 50 సంవత్సరాలు అద్దెకు ఇవ్వనున్నారు. వచ్చే ఐదు నుంచి పదేళ్ల సమయంలో దేశ విమానయాన రంగం మంచి ప్రగతి సాధిస్తుంది అని చెపుతూ..దేశంలోని విమానాశ్రయాల నుంచి ప్రయాణించే వారి సంఖ్య 90 కోట్లకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. అంతర్జాతీయ వృద్ధిరేటు..జనాభా పరంగా చూస్తే ఈ విషయంలో భారత్ ఇంకా చాలా వెనకబడి ఉందని చెప్పారు.