దేశంలోని ప్రతి నలుగురు విమాన ప్రయాణికుల్లో ఒకరు అదానీ గ్రూప్ సారధ్యంలోనే విమానాశ్రయాలను వాడుతున్న వారే. అతి తక్కువ సమయంలో అదానీ గ్రూప్ దేశీయ విమానాశ్రయాల్లో కీలక వాటాను దక్కించుకుంది. తాజాగా దేశంలోనే అత్యధిక ట్రాఫిక్ ఉండే ముంబయ్ అంతర్జాతీయ విమానాశ్రయం హక్కులను పూర్తిగా దక్కించుకుంది. ఈ ప్రక్రియ ఎప్పుడో ప్రాభరంభం అయినా..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు కూడా రావటంతో ముంబయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ (ఎంఐఏఎల్) అదానీ చేతికి వచ్చింది. దీంతో దేశంలోని అతి పెద్ద ఎయిర్ పోర్టు ఆపరేటర్ గా అదానీ గ్రూప్ అవతరించింది. ప్రస్తుతం అదానీ చేతిలో దేశంలోని ఎనిమిది విమానాశ్రయాలు ఉన్నాయి. విమానాశ్రయ ప్రయాణికుల వాటాలో అదానీ విమానాశ్రయాల వాటా 25 శాతం ఉండగా, దేశ ఎయిర్ కార్గొ 33 శాతంగా ఉంది.
అదానీ ఎయిర్ పోర్ట్స్ హోల్డింగ్స్ త్వరలోనే పబ్లిక్ ఇష్యూకు రావటం ద్వారా నిధులు సమీకరించే యోచనలో ఉంది. 2024 నాటికి భారత్ ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద విమానయాన మార్కెట్ గా అవతరిస్తుందనే అంచనాలు ఉన్నాయి. అదానీ చేతిలో అహ్మదాబాద్, లక్నో, మంగళూరు విమానాశ్రయాలు ఉన్నాయి. అదే సమయంలో గౌహతి, తిరువనంతపురం, జైపూర్ ల విమానాశ్రయాల స్వాధీనం ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఎయిర్ పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) పిలిచిన టెండర్లలో పాల్గొని ఈ ప్రాజెక్టులను అదానీ దక్కించుకుంది. దీంతోపాటు కొత్తగా అదానీ స్వయంగా నవీ ముంబయ్ విమానాశ్రయాన్ని డెవలప్ చేయాల్సి ఉంది. త్వరలోనే విమానాశ్రయ వ్యాపారాన్ని ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేసి మార్కెట్ ద్వారా నిధుల సమీకరించే పనిలో అదానీ గ్రూప్ ఉంది. ఆసియాలోనే అత్యంత రద్దీగా విమానాశ్రయం తమ చేతికిరావటం ఎంతో సానుకూల అంశంగా అదానీ గ్రూప్ భావిస్తోందని బిజినెస్ ఇన్ సైడర్ కథనాన్ని ప్రచురించింది.