కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఓఆర్ఆర్ లీజ్ అంశం అతి పెద్ద కుంభకోణం అని ఆరోపిస్తోంది. స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ఆరోపణలు చేశారు. అంతకు ముందు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా దీనిపై విమర్శలు చేశారు. ఒక వైపు ఇంత తీవ్రమైన ఆరోపణలు చేస్తూ దీనిపై సిబిఐ విచారణకు ముఖ్యమంత్రి కెసిఆర్ అనుమతి కోరుతారా?. అంటే కెసిఆర్ ఓకే అంటేనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సిబిఐ విచారణకు నిర్ణయం తీసుకుంటారా?. కేంద్రంలో తిరుగులేని మెజారిటీ తో ప్రభుత్వాన్ని నడుపుతూ స్కాం అని చెపుతూ ఇప్పుడు చేయించలేని సిబిఐ విచారణ...తెలంగాణ లో అధికారంలోకి వచ్చాక చేయించుతాం అంటే అసలు ఎవరైనా నమ్ముతారా?. చేతిలో అధికారం ఉన్నప్పుడు ఏమీ చేయకుండా అసలు వస్తుందో రాని అధికారం గురించి మాట్లాడుతూ అప్పుడు సిబిఐ విచారణ చేయించుతాం అంటే అందులో ఏ మాత్రం అయినా హేతుబద్దత ఉందా?. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపిస్తున్నట్లు ఓఆర్ఆర్ అతి పెద్ద కుంభకోణం అని నమ్మితే ఇప్పటికి ఇప్పుడు చర్యలు తీసుకోవాలి...అంతే కానీ తెలంగాణ లో అధికారంలోకి వస్తే అప్పుడు విచారణ చేయించుతాం అంటే ఇదేదో లెక్క తేడా అంశం అన్న అనుమానాలు రాక మానవు.
కాంగ్రెస్ పార్టీ ఇలాంటి మాటలు చెప్పింది అంటే కొంతలో కొంత అర్ధం చేసుకోవచ్చు.. ఎందుకంటే ఆ పార్టీ ఇప్పుడు ఎక్కడా అధికారంలో లేదు కాబట్టి. కానీ బీజేపీ ఇలా చెప్పింది అంటే దీన్ని కచ్చితంగా అనుమానించాల్సిన అంశంగానే చూస్తారు ఎవరైనా. ఢిల్లీ లిక్కర్ స్కాం లో అందరి అనుమతులు తీసుకుని విచారణ చేయించుతున్నారా?. కొద్ది రోజుల క్రితం తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. తెలంగాణాలో జరుగుతున్న అవినీతి దేశంలో మరెక్కడా లేదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయన కూడా తెలంగాణ లో బీజేపీ అధికారంలోకి వచ్చాక సీఎం కెసిఆర్ అక్రమాలపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు. అప్పుడు అమిత్ షా, ఇప్పుడు కిషన్ రెడ్డి మాటలు చూస్తుంటే ఎవరికైనా కేంద్రం కంటే రాష్ట్రం పవర్ పుల్లా..లేక ఏదో రాజకీయ అవసరాల కోసం అలా మాట్లాడుతున్నారా అన్న అనుమానాలు రాక మానవు. లేదు అంటే రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నట్లు బీజేపీ, బిఆర్ఎస్ తెర వెనక ఒప్పందాలతో ముందుకు వెళుతున్నాయనే సందేహాలు రావటం ఖాయం.
ఓఆర్ఆర్ పై సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో?
*ఐదేళ్లకు ఎన్నికైన ప్రభుత్వం ఎన్నికలకు ఆరు నెలల ముందు ఇంతటి కీలక నిర్ణయం తీసుకోవచ్చా?
*కొత్త ప్రాజెక్ట్ అయితే దీనిపై ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. కానీ ఓఆర్ఆర్ అంతా పూర్తి అయిన ప్రాజెక్ట్. ఆదాయమే తప్ప ఖర్చు చాలా తక్కువ .
*నూతన ఎయిర్ పోర్ట్ ప్రాజెక్ట్ లు అయితే పీపీపీ విధానంలో ఫస్ట్ 30 ఏళ్లకు...తర్వాత మరో 30 ఏళ్ళు పొడిగించేలా ఒప్పందాలు ఉంటాయి. వీటిపై టెండర్ దక్కించుకున్న కంపెనీ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఆదాయం ఎప్పుడో స్టార్ట్ అవుతుంది. ఓఆర్ఆర్ విషయంలో డే వన్ నుంచి ఆదాయం వస్తుంది. ఈ ప్రాజెక్ట్ నే తనఖా పెట్టి కంపెనీ బ్యాంకు లోన్ తెచ్చుకుంటుంది.
*ఒక వైపు కాంగ్రెస్, బీజేపీ లకు పాలించటం చేత కాదు అని చెపుతూ అలాంటి వాళ్ళ దగ్గరనుంచి ..అదే ఎన్ హెచ్ ఏ ఐ మోడల్ ఫాలో అయ్యాం అని చెప్పటం ఆత్మ వంచన కాదా?
#ప్రవేటీకరణకు వ్యతిరేకం అని చెప్పుకుంటూ ఓఆర్ఆర్ ను 30 ఏళ్లకు ఎందుకు ప్రవేటుపరం చేసినట్లు?
#ఈ డబ్బుతో తక్షణ ఎన్నికల అవసరాలు తీర్చుకోవటం...తెర వెనక ప్రయోజనాలే కారణం అనే విమర్శలు.
#క్రిసిల్ రిపోర్ట్ ఆధారంగా కాకుండా వేరే మోడల్ ఫాలో అవటానికి కారణం ఏంటి?
#ఏ ప్రయోజనం లేకుండా బంగారు బాతు లాంటి ఓఆర్ఆర్ ను ప్రవేట్ వ్యక్తులకు అప్పగించాల్సి అవసరం ఏముంది?
#ఒక వైపు ఎడా పెడా ప్రభుత్వ భూములు అమ్ముతూ..ఓఆర్ఆర్ ను కూడా ముప్పై ఏళ్లకు అమ్మేయటమేనా తెలంగాణ మోడల్ డెవలప్మెంట్.