టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తన తొలి స్పీచ్ లోనే అదరకొట్టారు. గాంధీ భవన్ లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే ప్రశాంత్ కిషోర్ (పీకె)ను పెట్టుకోమని చాలామంది సలహాలు ఇచ్చారు. సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు. అయితే కాంగ్రెస్ కు పీకెలు..ఏకె 47లు పాదరసం లాంటి కార్యకర్తలే అని వ్యాఖ్యానించారు. పార్టీ విధానాలను, మ్యానిఫెస్టోను ప్రజల్లోకి విజయవంతంగా తీసుకెళ్ళగలిగేది కార్యకర్తలే అని వ్యాఖ్యానించారు. కెసీఆర్ ఫాంహౌస్ లో బంధీ అయిన తెలంగాణ తల్లిని విడిపించేందుకు కార్యకర్తలు అందరూ కలసి ముందుకు సాగాలన్నారు. సీతను చెరబట్టిన రావణుడిపై పోరుకు వానరసైన్యం ఎలా సహకరించిందో..కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కెసీఆర్ ఫాంహౌస్ లలో బంధీ అయిన తెలంగాణను విడిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
పాత రోజుల్లో ఎవరైనా మంచి నీళ్ళు ఇస్తేనే చల్లగా ఉండాలని దీవిస్తారని..అది తెలంగాణ పద్దతి అంటూ...అలాంటిది అరవై ఏళ్ళ పోరాట ఫలితం అయిన తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలా వద్దా అంటూ కాంగ్రెస్ కార్యకర్తలను ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా అత్యంత కీలకమైన నిరుద్యోగుల కష్టాలు తీరలేదన్నారు. తాజాగా పీఆర్ సీ కమిటీ కూడా 1.80 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు నివేదిక ఇచ్చిందని అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు కూడా ఎన్ కౌంటర్లు ఆగలేదు...రైతుల ఆత్మహత్యలు ఆగలేదన్నారు. కెసీఆర్ తలనోట్లో పెట్టి తెలంగాణ తేలేదని..నిజాం ఆస్పత్రిలో వెల్ల్దకిలా పడుకున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో రాజకకీయంగా నష్టపోయినా ఎవరేమి అనుకున్నా తెలంగాణ ఇచ్చింది సోనిమయ్మ తల్లి అని రేవంత్ తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే న్యాయం జరుగుతుందని అన్నారు.