ఎంఐఎం దూకుడు చూపిస్తోంది. జాతీయ స్థాయిలో విస్తరించేందుకు వచ్చిన ఛాన్స్ ను పక్కాగా వాడుకుంటోంది. దీనిపై విమర్శలు ఎన్ని ఉన్నా ఒకప్పుడు కేవలం హైదరాబాద్ కు పరిమితమైన ఈ పార్టీ పలు రాష్ట్రాల్లో అడుగుపెట్టి విజయవంతం అవుతోంది. ఇప్పటికే మహారాష్ట్రలో ఎంఐఎంకు ఎమ్మెల్యేలు ఉన్నారు. తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఏకంగా ఐదు సీట్లు గెలుచుకుని సత్తా చాటింది. ఇప్పుడు వచ్చే ఏడాది జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ బరిలోనూ అభ్యర్ధులను దింపనుంది. ఇదే అంశంపై హైదరాబాద్ లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన నేతలతో సమావేశం నిర్వహించారు. పార్టీ విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలను వారితో చర్చించారు.
బెంగాల్ ప్రతినిధులతో ఈరోజు ఫలవంతమైన చర్చలు జరిగాయని అసదుద్దీన్ ట్విటర్‌లో పేర్కొన్నారు. బెంగాల్‌లో రాజకీయ పరిస్థితులు, పార్టీ ఉన్నతికి చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణపై చర్చించామని తెలిపారు. సమావేశానికి హాజరైన నేతలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీచేస్తామని ఏఐఎంఐఎం ప్రకటించింది. మైనారిటీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అభ్యర్ధులను దింపటం ద్వారా ఎంఐఎం పలు రాష్ట్రాల్లో బిజెపికి మేలు చేస్తుందనే విమర్శలు మూటకట్టుకుంటోంది. అయితే ప్రతి చోటా ఎంఐఎం సీట్లను సాధిస్తుండటం కూడా ఆ పార్టీకి సానుకూల అంశంగా మారింది.