టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కెసీఆర్ ఈ డిసెంబర్ లోనే అసెంబ్లీని రద్దు చేయనున్నారని..వచ్చే మార్చిలోనే ఎన్నికలు వస్తాయన్నారు. అందుకే కాంగ్రెస్ కార్యకర్తలు పన్నెండు నెలలు కష్టపడి పనిచేస్తే పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని అన్నారు. శనివారం నాడు కొంపల్లిలోని చంద్రారెడ్డి గార్డెన్స్ లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ సీఎం కెసీఆర్ పై విమర్శలు గుప్పించారు. కెసీఆర్ రద్దు అయిన వెయ్యి రూపాయల నోటులాంటోడు అన్నారు. . అది ఉన్నా ఒకటే..లేకపోయినా ఒకటే. వెయ్యి రూపాయల నోటులాగానే..కెసీఆర్ కు కూడా ఇప్పుడు విలువ లేదన్నారు. . పన్నెండు నెలల్లో ఎన్నికలు వస్తాయని స్పష్టం చేశారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఇదే చెబుతున్నారని వ్యాఖ్యానించారు. కష్టపడిన వారందరికీ గుర్తింపు లభిస్తుందని కార్యకర్తలకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. తాను మొదటి నుంచి మొదటి నుంచి చెబుతున్నట్లు ..ఫ్రంట్ లేదు..టెంట్ లేదన్నారు. జార్ఖండ్ లో సీఎం కెసీఆర్ తాను మోడీకి వ్యతిరేకం కాదు..ఫ్రంట్ పై ఇంకా ఆలోచన చేయలేదంటూ చేసిన ప్రకటనను ప్రస్తావించారు. . కెసీఆర్ ఢిల్లీ పోయాడు..మహారాష్ట్ర పోయాడు..జార్ఖండ్ పోయాడు అనుకుంటున్నారు అందరూ..కానీ ఎక్కడికీ పోడు..చివరకు చింతమడకకు పోవాల్సిందే అంటూ ఎద్దేవా చేశారు. కెసీఆర్ ను ప్రజలు తిరిగి చింతమడకకు పంపించే రోజు వచ్చింది. కెసీఆర్ కాలం అయిపోయిందన్నారు.