కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రైతులను తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే ప్రధాని నరేంద్రమోడీ మాత్రం అదే మాటపై ఉన్నారు. ఈ చట్టాలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని పునరుద్ఘాటించారు. ఈ చట్టాల్లో లోపాలు ఎక్కడ ఉన్నాయో ఎవరూ చెప్పలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ సోమవారం నాడు రాజ్యసభలో రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని ప్రతిపక్షాలు బహిష్కరించకుండా ఉండే బాగుండేదన్నారు. దేశం ప్రగతి పథంలో పయనిస్తోందని..రాష్ట్రపతి ప్రసంగం ప్రసంగం ఈ దశాబ్దానికే మార్గదర్శకం అన్నారు. సభ్యులంతా అమూల్యమైన అభిప్రాయాలు వెల్లడించారన్నారు. రాజ్యసభలో చర్చ సందర్భంగా ప్రధాని మోదీ రైతు దీక్షలను ప్రస్తావించారు. కేంద్రం, రైతుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయని, రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు. కరోనా వైరస్ పోరాటంలో భారత్ ప్రదర్శించిన స్ఫూర్తిని ప్రపంచ దేశాలు కొనియాడాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కోవిడ్ విపత్తును భారత్ ఎదుర్కున్న తీరు ప్రసంశనీయమని, ప్రపంచ దేశాలన్నీ మనవైపు చూస్తున్నాయని అన్నారు.
దేశం మరింత బలపడటానికి కరోనా వైరస్ బాటలువేసిందన్నారు. మన బలమేంటో ప్రపంచ దేశాలకు తెలిసిందన్నారు. లాక్‌డౌన్ సమయంలో కరోనా వారియర్స్ చేసిన సేవ వర్ణించలేనిదని వారి సేవలను కొనియాడారు. ప్రపంచ దేశాలకు ధీటుగా భారత్ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపడుతోందని అన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియనలో భారత్ ప్రపంచ శక్తిగా ఎదుగుతోందని పేర్కొన్నారు. కోవిడ్ సంక్షోభాన్ని భారత్ సమర్థవంతగా ఎదుర్కొందని, కంటికి కనిపించని శత్రువుతో పోరాటం చేస్తున్నామన్నారు. కరోనా వైరస్ టీకా అభివృద్ధిలో మనదేశ శాస్త్రవేత్తలు పోషించిన పాత్ర వర్ణించలేనిదని కొనియాడారు. ప్రపంచ ఫార్మా హబ్‌గా భారత్ ఎదుగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ భారత్‌లో కొనసాగుతోంది.. మన బలమేంటో ప్రపంచానికి అర్థమైంది. నూతన అవకాశాల నిలయంగా భారత్ మారుతోంది. అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలి. అనేక అవకాశాలు మనకోసం ఎదురుచూస్తున్నాయి. ఆత్మనిర్భర్ భారత్ వైపు అడుగులు పడేలా చేసింది. కరోనాపై విజయం ప్రభుత్వానిది కాదు.. ప్రజలందరిది. మానవాళి రక్షణకు భారత్ కృషిని ప్రపంచమంతా ప్రశంసిస్తోంది' అని అన్నారు.