మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తాజాగా ఓ ఫాంహౌస్ లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో సమావేశం అయ్యారని..ఆయన త్వరలోనే బిజెపిలో చేరతారంటూ మీడియాలో హోరెత్తించారు. అసలు జరగని ఈ భేటీపై రకరకాల ప్రచారాలు తెరపైకి తీసుకొచ్చారు. అయితే దీనిపై కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆయన మంగళవారం నాడు మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఇప్పటి వరకు తానను ఈటల రాజేందర్ కలవలేదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.
అయితే తనను కలిసేందుకు సంప్రదించిన మాట మాత్రం వాస్తవమేనన్నారు. ఈటల, తాను 15 ఏళ్లు కలిసి పనిచేశామని.. కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. కలిసినంత మాత్రాన పార్టీలో చేరేందుకు అనుకోలేమన్నారు. ఎప్పుడు కలుస్తామన్నది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. అందరినీ కలుస్తున్నా, అలాగే తననూ కలుస్తా అని అన్నారని కిషన్‌రెడ్డి వివరించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక వస్తే పోటీ అంశంపై చర్చించలేదని.. పార్టీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని కిషన్‌రెడ్డి తెలిపారు.