కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి పీసీసీ అంశంపై స్పందించారు. పీసీసీ పదవి తన దృష్టిలో చాలా చిన్నదని వ్యాఖ్యానించారు. అదే సమయంలో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చిన్న పిల్లాడు అంటూ స్పందించారు. రేవంత్ గురించి తన దగ్గర మాట్లాడొద్దని సూచించారు. రాజకీయాలపై మాట్లాడనని గతంలోనే చెప్పానని తెలిపారు. కోమటిరెడ్డి ఆదివారం నాడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలోనే ఆయన ఈ మాటలన్నారు. . తెలంగాణ కాంగ్రెస్‌ను ముందుకు నడిపే సమర్థవంతమైన నాయకుడు లేడని అన్నారు.
నేతలు రాజకీయాలు వదిలేసి అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. ఎవరి నియోజకవర్గం వారు గెలిపించుకుంటే అదే ఎక్కువని అన్నారు. ప్రజా సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడతానని తెలిపారు. తాను కాంగ్రెస్ లోనే ఉంటానని..పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఢిల్లీలో ఉన్న కోమటిరెడ్డి కొత్తగా పర్యాటక శాఖ కేబినెట్ బాధ్యతలు తీసుకున్న కిషన్ రెడ్డితో సమావేశం అయ్యారు. భువనగిరి కోట అభివృద్ధికి నిదులు కేటాయించాల్సిందిగా కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి ఓ వినతిపత్రం అందజేశారు.