ఈటెలకో న్యాయం..జూపల్లికో న్యాయమా?

Update: 2021-05-01 11:34 GMT

ముఖ్యమంత్రి కెసీఆర్ పై బిజెపి ఎంపీ దర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఈటెలకో న్యాయం? జూపల్లికో న్యాయమా అని ప్రశ్నించారు. పేద ప్రజల భూదాన్ భూముల్లో ఫ్యాక్టరీలు, అటవీ భూముల్లో మైనింగ్‌లపై కేంద్రం మూడు సార్లు నోటీసులు ఇచ్చినా ఎందుకు స్పందించడం లేదంటూ ఎంపీ అరవింద్‌ ప్రశ్నించారు. జూపల్లి రామేశ్వరరావు భూదాన్ భూములు ఆక్రమించుకున్నారని జిల్లా కలెక్టర్ నివేదిక ఇచ్చారని..ఇవి ఆరోపణలు కూడా కాదన్నారు. మరి ఎందుకు ఇప్పటివరకూ జూపల్లిపై చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రజలు ఆక్సిజన్, రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు, డాక్టర్ల కొరతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే సీఎం కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని ధర్మపురి అరవింద్‌ ఫైర్ అయ్యారు

ఈటెలపై అవినీతి ఆరోపణలపై కేసీఆర్ కుంభకర్ణుడి నిద్ర లేచి.. విచారణకు ఆదేశించడం హాస్యాస్పదమన్నారు. అవినీతి ఆరోపణలు ఉన్న టీఆర్‌ఎస్‌ నేతలందరిపై సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్‌ చేశారు. మంత్రి ఈటెల గ్రాఫ్ క్రమంగా పెరుగుతోందనే అక్కసుతోనే ఆయనపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. ఈటెలపై కేసీఆర్‌ రాజకీయ ప్రతీకారం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మై హోం రామేశ్వరరావు అక్రమాలపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడంలేదని ఆయన ప్రశ్నించారు.

Tags:    

Similar News