కెసీఆర్ కోసం స్టాలిన్ కాంగ్రెస్ ను వదిలేస్తారా?!

Update: 2021-12-14 16:00 GMT
కెసీఆర్ కోసం స్టాలిన్ కాంగ్రెస్ ను వదిలేస్తారా?!
  • whatsapp icon

కాంగ్రెస్, డీఎంకెల మ‌ధ్య సంబందాలు ప్ర‌స్తుతం ఎంతో బ‌లంగా ఉన్నాయి. మ‌రి టీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కెసీఆర్ కోసం డీఎంకె అధినేత‌, త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ కాంగ్రెస్ ను వదిలేసి వ‌స్తారా?. అలా రావ‌టం వ‌ల్ల ఆయ‌న‌కు రాజ‌కీయంగా క‌లిగే లాభం ఏమి ఉంటుంది?. మారిన ప‌రిస్థితుల్లో ఒక వేళ కెసీఆర్ కూడా కాంగ్రెస్ తో భ‌విష్య‌త్ లో జ‌ట్టుక‌ట్టే ఛాన్స్ ఉంటుందా?. అందుకే స్టాలిన్ తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారా?. ఇదీ రాజ‌కీయ వ‌ర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్. త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ తో భేటీలో రాజ‌కీయ అంశాలు కూడా ఉంటాయ‌ని టీఆర్ఎస్ సీనియ‌ర్ నేత బోయిన‌ప‌ల్లి వినోద్ కుమార్ హైద‌రాబాద్ లో వెల్ల‌డించారు. కాంగ్రెసేత‌ర‌, బిజెపియేత‌ర ప్ర‌త్యామ్నాయం కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలిపారు. అయితే కెసీఆర్, స్టాలిన్ స‌మావేశం ఫోటోలు చూసిన త‌ర్వాత ఇది ఫ్యామిలీ మీటింగా?. లేక పొలిటిక‌ల్ మీటింగా అన్న అనుమానం రాక‌మాన‌దు. ముందు వెల్ల‌డించిన‌ట్లు తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసీఆర్ త‌న కుటుంబ స‌భ్యులు అంద‌రితో క‌ల‌సి మంగ‌ళ‌వారం సాయంత్రం త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ తో స‌మావేశం అయ్యారు.

ఇందులో స్టాలిన్ కుటుంబ స‌భ్యులు కూడా పాల్గొన్నారు. అయితే త‌ర్వాత కెసీఆర్, స్టాలిన్ లు విడిగా స‌మావేశం అయ్యారు. ఈ భేటీ సందర్భంగా యాదాద్రి ఆలయ పునః ప్రారంభవేడుకలకు రావాల్సిందిగా స్టాలిన్‌ను సీఎం కేసీఆర్‌ ఆహ్వానించారు. మార్చి 22న సుదర్శన యాగంతో ప్రారంభమయ్యే వేడుకలు 28న అర్ధరాత్రి ముగియనున్నాయి. ఆ వారం రోజుల్లో ఏదో ఒకరోజు వచ్చి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకోవాలని స్టాలిన్‌ను కేసీఆర్‌ కోరినట్టు అధికారవర్గాలు తెలిపాయి. గ‌త కొంత కాలంగా కెసీఆర్ కేంద్రంలోని బిజెపి తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అయితే స్టాలిన్ యూపీఏలో భాగ‌స్వామిగా ఉన్నారు. కాంగ్రెస్ పై ఎవ‌రెన్ని విమ‌ర్శ‌లు చేసినా స్టాలిన్ మాత్రం ఆ పార్టీకి అండ‌గా ఉంటూ వ‌స్తున్నారు. మ‌రి ఇప్పుడు కెసీఆర్ ప్ర‌తిపాదించే కూట‌మి వైపు ఆయ‌న మొగ్గుచూపుతారా లేదా అన్న‌ది వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News