టీఆర్ఎస్ ఏమైనా స‌న్నాసుల మ‌ఠ‌మా?

Update: 2021-07-21 13:41 GMT

ద‌ళిత‌ బంధు ప‌థ‌కంతో రాజ‌కీయ ప్ర‌యోజ‌నం కోరుకుంటే త‌ప్పేంటి?

ముఖ్య‌మంత్రి కెసీఆర్ ద‌ళిత బంధు ప‌థ‌కం అమ‌లుకు సంబంధించి సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. హుజూరాబాద్ కు చెందిన కాంగ్రెస్ మాజీ నేత పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరిక సంద‌ర్భంగా జ‌రిగిన స‌మావేశంలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. కొంత మంది అంటున్నారు ఎన్నిక‌లు ఉన్నాయని ద‌ళిత బంధు అక్క‌డ పెడుతున్నార‌ని..పెట్ట‌మా మ‌రి..టీఆర్ఎస్ ఏమైనా స‌న్నాసుల మ‌ఠ‌మా...ఇది కూడా రాజ‌కీయ పార్టీయే క‌దా అని వ్యాఖ్యానించారు. కెసీఆర్ ఇవాళ ద‌ళిత బంధు తెచ్చి పెట్టి నడుపుతున్నాడు ఏ శ‌క్తితో న‌డుపుతున్నాడండీ. ముఖ్య‌మంత్రిగా ఉంటే క‌దా న‌డిపేది..టీఆర్ఎస్ కు అధికారం ఉంటేగా న‌డిపేది. మనం ఏమైనా హిమాల‌య ప‌ర్వ‌తాల్లో ఉన్నామా? ప్రాక్టిక‌ల్ గా ప్ర‌జ‌ల్లో ఉన్నాం..రాజ‌కీయాల్లో ఉన్నామ‌ని వ్యాఖ్యానించారు. స్కీమ్ పెడ‌తాం మాకు రాజ‌కీయ లాభం జ‌ర‌గాల‌ని ఎందుకు కోరుకోం. చేసినోడు లాభం కోరుకుంటే త‌ప్పేముంది..చేయ‌నోడు లాభం కోరుకుంటే చేసినోడు కోరుకోవద్దా..క‌రీంన‌గ‌ర్ నా సెంటిమెంట్ . త‌న‌కు స్వార్ధం ఉంటే ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని గ‌జ్వేల్ లో ప్రారంభించేవాడిన‌ని, . ఇది సొంత నియోజ‌క‌వ‌ర్గం అన్నారు. ప్ర‌జాస్వామ్యంలో గెలుపు ఓట‌ములు స‌హ‌జం అని.. శాశ్వ‌తంగా ఎవ‌రూ అధికారంలో ఉండ‌ర‌ని సీఎం కెసీఆర్ వ్యాఖ్యానించారు.

ఒక్కో ప‌థ‌కం రూప‌క‌ల్ప‌న వెన‌క ఎంతో మేథోమ‌థ‌నం ఉంద‌న్నారు. ద‌ళిత‌బంధును హుజూరాబాద్ లోనే పైల‌ట్ ప్రాజెక్టుగా అమ‌లు చేస్తున్నామ‌న్నారు. క‌రీంన‌గ‌ర్ లోనే ఎన్నో ప్ర‌తిష్టాత్మ‌క స్కీమ్ లు ప్రారంభించామ‌ని గుర్తు చేశారు. తెలంగాణ‌లో ఇప్పుడు రైతుల ఆత్మ‌హ‌త్య‌లు ఆగిపోయాయ‌ని, . రాష్ట్ర వ్యాప్తంగా కొత్త క‌లెక్ట‌రేట్లు ప్రారంభించుకుంటున్నామ‌ని తెలిపారు. 'కౌశిక్‌ రెడ్డి తండ్రి సాయినాథ్‌రెడ్డి నాకు చిరకాల మిత్రుడు. తెలంగాణ ఉద్యమంలో సాయినాథ్‌రెడ్డి నాతో కలిసి పని చేశారు. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కౌశిక్‌రెడ్డి పార్టీలో చేరారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ సలహాతో ఉద్యమాన్ని నడిపాం. ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఉద్యమం కొనసాగించామ‌ని తెలిపారు. కౌశిక్ రెడ్డికి మంచి భ‌విష్య‌త్ ఉంటుంద‌ని..హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోనే కాకుండా..జిల్లా స్థాయిలో..రాష్ట్ర స్థాయిలో గుర్తుంపు వ‌చ్చేలా చూస్తామ‌న్నారు. కౌశిక్ రెడ్డితోపాటు ఆయ‌న అనుచరుల‌కు కూడా కెసీఆర్ పార్టీ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Tags:    

Similar News