మోడీని మూడవ సారి ప్రధాని చేసేందుకే కెసీఆర్ ప్రయత్నాలు
కెసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే యూపీలో మోడీ..యోగీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలి
టీపీసీసీ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగరేణిలో రాఫెల్ స్కామ్ ను మించిన కుంభకోణం జరగనుందని ఆరోపించారు. ఓ బొగ్గు గని ద్వారా ఏకంగా 50 వేల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరతీశారన్నారు. ఒరిస్సాలోని నైని బొగ్గు గనిని అదానీ కంపెనీకి ఏకంగా 25 సంవత్సరాలకు అప్పగించేందుకు రంగం సిద్ధం అవుతోందని తెలిపారు. అత్యంత క్వాలిటీ బొగ్గు ఉన్న ఈ గనిలో సింగరేణి సొంతంగా బొగ్గు వెలికితీయకుండా 25 సంవత్సరాలకు ప్రైవేట్ కంపెనీకి అప్పగించేందుకు కుట్ర చేశారన్నారు. ఇంత జరుగుతున్నా అధికార టీఆర్ఎస్ పార్లమెంట్ లో ఈ అంశాన్ని ప్రస్తావించలేదని..పైగా కేంద్రానికి పూర్తిగా సహకరిస్తోందని విమర్శించారు. సింగరేణి సీఎండీ శ్రీధర్ పై కూడా రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ ఆయన్ను ఎనిమిది సంవత్సరాలుగా ఈ పదవిలో కొనసాగిస్తున్నారని తెలిపారు.ఈ బొగ్గు గని అవినీతిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కోరితే తాను ఏమీ చేయలేనని ఆయన తెలిపారన్నారు.
ఎండీ సహకారంతోనే ఇది అంతా సాగుతుందన్నారు. అదే సమయంలో సీఎం కెసీఆర్ తీరుపై కూడా రేవంత్ మండిపడ్డారు. కాంగ్రెస్‌ను బలహీనపర్చి ఈ దేశానికి నరేంద్రమోదీని మూడోసారి ప్రధానమంత్రిగా చేయడానికి సీఎం కేసీఆర్ పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారని ఆరోపించారు. మోదీని బలహీనం చేయాలంటే... ఎన్డీయేలో ఉన్నవాళ్లను చీల్చాలన్నారు. సీఎం కేసీఆర్ యూపీఏలో ఉన్నవాళ్లను చీల్చడానికి ప్రయత్నం చేస్తున్నారా? లేక ఎన్డీయేలో ఉన్నవాళ్లను చీల్చడానికి ప్రయత్నం చేస్తున్నారా? అని ప్రశ్నించారు.కెసీఆర్‌కు నిజంగా మోదీని ఓడించాలనే ఉంటే.. యూపీలో సభలు పెట్టాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఉత్తర ప్రదేశ్‌లో ఇంకా నాలుగు విడతల ఎన్నికలు ఉన్నాయని, మోదీ, యోగీని ఓడించడానికి విడతకొక బహిరంగ సభలు పెట్టాలన్నారు. మోదీని గెలిపించాలని యూపీ ప్రజలకు చెబుతారని... ఇక్కడేమో మోదీని ఓడిస్తానని చెబుతారని... ఈ రెండింటికి అసలు సారూప్యత ఉందా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.