తెలంగాణ రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోంది. బిజెపి వర్సెస్ టీఆర్ఎస్ రాజకీయ రగడ దాడుల వైపు మళ్లింది. సోమవారం నాడు తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజయ్ చేపట్టిన నల్లగొండ జిల్లా పర్యటన ఆసాంతం ఉద్రిక్తంగా మారింది. ప్రారంభం నుంచి అదే ఒరవడి కొనసాగింది. సంజయ్ పర్యటన సందర్భంగా పలు చోట్ల అదికార టీఆర్ఎస్ శ్రేణులు ఆయనకు నల్లజెండాలతో స్వాగతం పలికాయి. బిజెపి శ్రేణులుకూడా వీటిని అడ్డుకునే ప్రయత్నం చేశాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదిలా ఉంటే సూర్యాపేట చిల్లేపల్లిలో బండి సంజయ్ కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడులు సంజయ్ కాన్వాయ్ లోని పలు కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. ధాన్యం కొనుగోలు తీరును పరిశీలించేందుకు సంజయ్ ఈ పర్యటన తలపెట్టారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు మోదీ డౌన్ డౌన్ అంటే , కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ బీజేపీ శ్రేణులు నినాదాలు చేశాయి. బండి సంజయ్ వాహనంపై టీఆర్ఎస్ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేశారు. కాన్వాయ్‌పై దాడికి నిరసనగా నార్కెట్‌పల్లి అద్దంకి జాతీయ రహదారిపై బైఠాయించిన బీజేపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. అంతకు ముందు సంజయ్ మీడియాతో మాట్లాడుతూ రైతుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ గజినిలా మారాడని విమర్శించారు. ఒకసారి పత్తి వేయమని, ఒక సారి ధాన్యం వెయ్యమని, మరోసారి వద్దని రైతులను తప్పుదారి పట్టిస్తున్నాడని మండిపడ్డారు. రైతులు పండించిన ప్రతి గింజను తెలంగాణ ప్రభుత్వం కొనాల్సిందేనని ఆయనడిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులపై రాళ్లతో దాడి చేస్తారా.? అని మండి పడ్డారు.
నల్లగొండ జిల్లా ఆర్జాలబావి ఐకేపీ సెంటర్‌ను బండి సంజయ్ పరిశీలించారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం చిల్లెపల్లి వద్ద టీఆర్ఎస్ కార్యకర్తల ధర్నా నిర్వహించారు. గో బ్యాక్ బండి సంజయ్ అంటూ నినాదాలు చేశారు. అదే విధంగా నేరెడుచర్ల మండలం చిల్లపల్లి బ్రిడ్జి వద్దకు గట్టు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. బండి సంజయ్ పర్యటనను అడ్డుకునేందుకు బ్రిడ్జి వద్దకు వస్తున్న టీఆర్ఎస్ కార్యకర్తలు వస్తుండటంతో పోలీసులు భారీగా మొహరించారు. ఈ పర్యటనను అడ్డుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే భాస్కరరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఐకేపీ సెంటర్ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు పరస్పరం వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. దీంతో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా బలగాలను మోహరించారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమే ఐకేపీ సెంటర్‌ను పరిశీలించిన బండి సంజయ్ రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.