'సామాన్యుడు' మూవీ రివ్యూ

Update: 2022-02-04 10:51 GMT

హీరో విశాల్ కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. అందుకే ఆయ‌న తమిళ సినిమాలు అన్నీ తెలుగులోకి డ‌బ్ అవుతుంటాయి. ఇప్పుడు సామాన్యుడు కూడా అదే కోవ‌లో శుక్ర‌వారం నాడు తెలుగులోనూ విడుద‌లైంది. ఈ వారం తెలుగులో పెద్ద హీరోల సినిమాలు ఏమీ కూడా లేక‌పోవ‌టం ఓ రకంగా విశాల్ కు క‌లిసొచ్చింద‌నే చెప్పాలి. ఈ సినిమాలో విశాల్ కు జోడీగా డింపుల్ హ‌య‌తి న‌టించింది. క్రైమ్ థ్రిల్ల‌ర్ గా సామాన్యుడు సినిమాను ద‌ర్శ‌కుడు శ‌ర‌వ‌ణ‌న్ తెర‌కెక్కించారు. ఇక సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే కాలుష్యం వెద‌జ‌ల్లే ఓ ప‌రిశ్ర‌మ‌. ఆ ప‌రిశ్ర‌మ ఆనుకుని ఉండే పిల్ల‌లు..పెద్ద‌ల‌కు ప్రాణాంత‌క వ్యాధులు రావటం. దీనికి ఓ బాధిత కుటుంబం పోరాటం. ఆ పారిశ్రామిక‌వేత్తే రాజ‌కీయ నేత‌గా మారేందుకు అడుగులు. మ‌ధ్య‌లో ఓ పోలీస్ కానిస్టేబుల్ కుమారుడు అయిన పోర‌స్ (విశాల్) ఓ వైపు తాను కూడా పోలీసు ఉద్యోగం సాధించే ప్ర‌య‌త్నం చేస్తుంటాడు. మ‌ధ్య‌లో త‌న చెల్లెలను ప్రేమిస్తున్నాన‌ని ఓ రౌడీ వేధింపుల‌కు గురిచేయ‌టం, ఆ త‌ర్వాత హ‌త్య‌కు గుర‌వ‌టంతో కథ కొత్త మ‌లుపు తిరుగుతుంది. పోలీసు ఉద్యోగం పొందేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న త‌న కొడుకు గొడ‌వ‌ల్లో చిక్కుకుపోతాడేమో అన్న ఆందోళ‌న తండ్రిలో వివాదాల‌కు దూరంగా ఉండలంటాడు. పోలీస్ అయి ఉండి కూడా సొంత కుటుంబాన్ని కాపాడుకోలేక‌పోయార‌ని తండ్రిపై ఫైర్ అవుతాడు విశాల్. పోర‌స్ చెల్లితోపాటు మరికొన్ని హత్యలు కూడా జరుగుతాయి. వాటి వెనుక కొన్ని రాజకీయ శక్తులుంటాయి. వాటిని ఛేదించి, హత్యల వెనుకున్న హంతకుల్ని బైటికి లాగి.. పోరస్ తన రివెంజ్ ఎలా తీర్చుకున్నాడు అన్నదే క‌థ‌.

సంప‌న్నుల చేతిలో పోలీసులు కీలుబొమ్మలుగా ఎలా మారుతారు? జరిగింది అన్యాయం, అక్రమం అని తెలిసినా పోలీసు డిపార్ట్ మెంట్ కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఎలా చిక్కుకుంటుంది? వాళ్ళు చేయలేని పనిని ఓ సామాన్యుడు, ధైర్యవంతుడైన యువకుడు తన తెలివితేటలతో వాటిని ఎలా ఎదుర్కొన్నాడు అనే పాయింట్ తో సినిమా అంతా న‌డిపించాడు ద‌ర్శ‌కుడు. ఫ‌స్టాఫ్ అంతా రొటీన్ గా సాగిపోతుంది. సెకండాఫ్ నుంచి కథనం గాడిలో పడుతుంది. ఆసక్తికరమైన సన్నివేశాలతో.. గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లేతో సన్నివేశాలు చకచకా సాగుతాయి. పోరస్‌గా మధ్యతరగతి యువకుడి పాత్రలో విశాల్ మెప్పిస్తాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో తన మార్క్ చూపించాడు. అలాగే ఎమోషనల్ సీన్స్ లో అతడి నటన ఆకట్టుకుంటుంది. కథానాయికగా డింపుల్ హయతి పాత్రకు అంతగా ప్రాధాన్యం లేదు. విశాల్ చెల్లెలుగా రవీనా, తల్లిగా తులసి, విలన్ గా మలయాళ నటుడు బాబూ రాజ్ తమ పాత్రలకు న్యాయం చేశారు. అలాగే విలన్ తమ్ముడిగా రాజా చెంబోలు నటన ఆకట్టుకుంటుంది. ఇలాంటి క‌థ‌ల‌తో ఇప్ప‌టికే చాలా సినిమాలు వ‌చ్చాయి. అయినా క‌థ‌నంలో గ్రిప్పింగ్ తో సినిమాను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు ఓకే అన్పిస్తాడు. ఓవ‌రాల్ గా చూస్తే 'సామాన్యుడు' ఓకే మూవీ.

రేటింగ్. 2.5\5

Tags:    

Similar News