'పుష్ప‌' మూవీ రివ్యూ

Update: 2021-12-17 07:18 GMT

అల‌..వైకుంఠ‌పురంలో సినిమాతో భారీ హిట్ అందుకున్న త‌ర్వాత అల్లు అర్జున్ చేసిన సినిమా పుష్ప‌. అంతే కాదు..సుకుమార్..అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో ఇది హ్యాట్రిక్ సినిమా కావ‌టంతో పుష్ప‌పై అంచ‌నాలు ఓ రేంజ్ కు చేరాయి. ఈ సినిమాలో ప్ర‌తి క్యారెక్ట‌ర్ లుక్ కూడా డిఫ‌రెంట్ గానే ఉంది. ట్రైల‌ర్ తో పుష్ప మూవీపై ఫ్యాన్స్ పై భారీ ఆశ‌లే పెట్టుకున్నారు. భారీ అంచ‌నాల మ‌ధ్య పుష్ప శుక్ర‌వారం నాడు విడుద‌లైంది. ఈ సినిమా ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ విష‌యంపై అన్న అంశం ఎప్పుడో బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో క‌థ‌లో స‌స్పెన్స్ ఏమీ లేదు. ఈ సినిమాలో చెప్పుకోద‌గ్గ అంశం అంటే పూర్తిగా అల్లు అర్జున్ న‌ట‌నే. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్ బ్యాచ్ లోకూలీగా..స్మ‌గ్ల‌ర్ గా అల్లు అర్జున్ త‌న న‌ట‌న‌తో సినిమాను ఒంటిచెత్తో న‌డిపించాడు. పుష్ప‌లో ఉన్న కీల‌క డైలాగ్ లు అన్నీ ట్రైల‌ర్ రూపంలో ముందే బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

                                    ఈ సినిమా అంతా పూర్తిగా అల్లు అర్జున్ న‌ట‌న‌పైనే ఆధార‌ప‌డి న‌డిచింది. ఓ అడ్డాలో కూలీల‌ను తీసుకెళ్లే బ్యాచ్ ఒక చోట అయితే రెండువంద‌లు. మ‌రో చోట అయితే వెయ్యి రూపాయ‌లు కూలీ వ‌స్తుంది అని చెబుతారు. రెండు వంద‌ల కూలీకి వెళితే సాయంత్రానికి ఇంటికి సేఫ్ గా వ‌స్తారు..వెయ్యి రూపాయ‌ల కూలీకి వెళితే వ‌స్తారో రాదో తెలియ‌దు అంటారు. పుష్ప మాత్రం సాయంత్రం బ‌య‌టికొచ్చి చేయాల్సిన ప‌నులు నాకేమీ లేవంటూ వెయ్యి రూపాయ‌ల కూలీవైపే వెళ‌తాడు. ఓ రోజు ప‌ని అయిన త‌ర్వాత రెస్ట్ తీసుకుంటూ కుర్చీలో కూర్చుని కాలిమీద కాలువేసి తీ తాగుతుంటాడు ఈ స‌మ‌యంలోనే ఓన‌ర్ వ‌చ్చినా లేవ‌కుండానే అలాగే ఉంటాడు. అది చూసి యాజ‌మాని ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌టంతో తాను ఇక్క‌డ ప‌ని చేయ‌న‌ని ..ఓన‌ర్ ను మార్చేస్తానంటూ వేరే చోట ప‌నికి వెళ‌తాడు. అక్క‌డ కూలీ నుంచి ఎర్రచంద‌నం స్మ‌గ్లింగ్ లో వాటాదారుగా మార‌తాడు.

వాటాదారు కాస్తా స్మ‌గ్లింగ్ సిండికేట్ కు లీడ‌ర్ గా అల్లు అర్జున్ ఎలా మారాడు అన్న‌దే పుష్ప సినిమా. కూలీ ద‌గ్గ‌ర నుంచి సిండికేట్ లీడ‌ర్ గా మారినంత వ‌ర‌కూ అల్లు అర్జున్ త‌న న‌ట‌న‌తో దుమ్మురేపాడు. పుష్ప‌రాజ్ పాత్ర‌ను అలా ఒంటిచేత్తో చేసేశాడు. అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న‌ల ల‌వ్ ట్రాక్ కూడా స‌ర‌దా స‌ర‌దాగా న‌వ్వులు పూయిస్తుంది. సినిమా తొలి భాగం అల్లు అర్జున్ యాక్షన్, ర‌ష్మిక మంద‌న‌ల ల‌వ్ ట్రక్ తో చాలా స‌ర‌ద‌గా సాగిపోతుంది. కానీ సెకండాప్ లో మాత్రం సినిమా కాస్త స్లో అయిన‌ట్లు క‌న్పిస్తుంది. ఎర్ర‌చంద‌నం సిండికేట్ లీడ‌ర్ గా.. విల‌న్ గా సునీల్ వెరైటీ పాత్ర‌లో క‌న్పించాడు ఈ సినిమాలో. స‌మంత ప్ర‌త్యేక గీతంతోపాటు సినిమాలో పాట‌లు ఆన్నీ ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. సెకండాఫ్ చివ‌రిలో ఎస్పీగా ఎంట్రీ ఇచ్చిన విల‌న్ ప‌హ‌ద్ ఫాజిల్, అల్లు అర్జున్ కాంబినేష్ లో వ‌చ్చిన స‌న్నివేశాలు ఆక‌ట్టుకున్నాయి. శేషాచ‌లం అడవులు కేంద్రంగా సాగే క‌థ కావ‌టంతో సినిమా అంతా అల్లు అర్జున్ చిత్తూరు యాస‌లోనే మాట్లాడాడు. అయితే ఈ విష‌యంలో ఎక్క‌డా తేడా రాకుండా జాగ్ర‌త్త‌ప‌డ్డాడు. ఓవ‌రాల్ గా చూస్తే 'పుష్ప' లో ఫైర్ కాస్త త‌గ్గింది. సెకండాఫ్ లో కూడా అది పెంచి ఉంటే..మంట‌లు మ‌రింత మండేవి.

రేటింగ్. 3.25\5

Tags:    

Similar News