'హీరో' మూవీ రివ్యూ

Update: 2022-01-15 12:35 GMT

సినిమాల ప‌రంగా చూస్తే ఈ సారి సంక్రాంతికి ఓ ప్ర‌త్యేక‌త ఉంది. క‌రోనా భ‌యాల‌తో ఒక్క బంగార్రాజు త‌ప్ప పెద్ద సినిమాలు దూరం దూరం అంటూ వాయిదాల‌తో జాగ్ర‌త్త‌లు పాటించారు. ఈ సంక్రాంతి సీజ‌న్ లో ఇద్ద‌రు వార‌సుల లాంచింగ్ ఓ ప్ర‌త్యేక‌త‌గా చెప్పుకోవ‌చ్చు.. ఒక‌రు దిల్ రాజు అన్న కొడుకు ఆశిష్ రెడ్డి రౌడీబాయ్స్ సినిమాతో రాగా..టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్, హీరో మ‌హేష్ బాబు మేన‌ల్లుడు అశోక్ 'హీరో' సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఇద్ద‌రు లాంచింగ్ హీరోల ఆర్ధిక మూలాలు బ‌లంగా ఉండ‌టంతో సినిమాల విష‌యంలో ఎక్క‌డా రాజీప‌డ‌కుండా వ్య‌వ‌హ‌రించారు. అశోక్ తొలి సినిమా హీరో నిర్మాణ సంస్థ కూడా సొంత బ్యాన‌ర్ అమ‌ర‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్ టైన్ మెంట్ కావ‌టంతో నిర్మాణం విష‌యంలో ఎక్క‌డా రాజీప‌డ‌లేదు. అయితే సినిమాలు క్లిక్ కావ‌టానికి డ‌బ్బు ఒక్క‌టే చాల‌దు. డ‌బ్బు ఉంటేనే సినిమాలు హిట్ అవుతాయ‌నుకుంటే ఇప్ప‌టికే ప‌రిశ్ర‌మ‌లో కుప్ప‌లుతెప్ప‌లుగా హీరోలు ఉండేవారు. ఇక హీరో సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే గ‌ల్లా అశోక్ తొలి సినిమా కావ‌టంతో ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య ప‌లు అంశాల‌ను మేళవించి క‌థ రాసుకున్నాడు.

మాఫియా వ్య‌వ‌హారాలు, ప్రేమ‌, కామెడీ వంటి అంశాల రంగ‌రింపుగా తెర‌కెక్కించి లాంచింగ్ సినిమాకు ఉండాల్సిన అన్ని అంశాలు ఉండేలా చూసుకున్నాడు. హీరో అర్జున్ సినిమా హీరో కావాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్న త‌రుణంలో ఇంటికి ఓ కొరియ‌ర్ వ‌స్తుంది. అందులో గ‌న్ ఉండ‌టం చూసి షాక్ అవుతాడు. గ‌న్ అందిన త‌ర్వాత ఎవ‌రిని చంపాలో ఆ వ్య‌క్తి ఫోటో కూడా పంపుతారు. అస‌లు మంబ‌య్ మాఫియా నుంచి అర్జున్ కు ఇవ‌న్నీ ఎందుకొచ్చాయి. దీని వెన‌క క‌థ ఏమిటి అన్న‌దే సినిమా. ప్ర‌తి సినిమాలోలాగానే చాలా సినిమాల త‌ర‌హాలోనే ప‌క్కింట్లో ఉండే అమ్మాయి సుభ‌ద్ర (నిధి అగ‌ర్వాల్ )తో అర్జున్ ప్రేమ‌లో ప‌డ‌తాడు. అయితే ఇందుకు సుభ‌ద్ర తండ్రి అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తాడు. ఈ చిక్కుల‌న్నింటిని అర్జున్ ఎలా అధిగ‌మించాడు అన్న‌ది వెండితెర‌పై చూడాల్సిందే.

అశోక్ ప‌రిచ‌య సినిమా కావ‌టంతో ఎక్కువ‌గా హీరో ఎలివేష‌న్ పైనే ఫోక‌స్ పెట్టారు. తొలి సినిమా కావ‌టంతో గ‌ల్లా అశోక్ పై ఇప్పుడే ఓ అంచ‌నాకు రావ‌టం క‌ష్టం. చాలా వ‌ర‌కూ ఓకే అన్పిస్తాడు. ఈ సినిమాలో నిధి అగ‌ర్వాల్ పాత్ర ప‌రిమిత‌మే. ఇత‌ర కీల‌క పాత్ర‌లు పోషించిన జగపతిబాబు, కౌసల్య, రవికిషన్‌ పాత్రల ప‌రిధి మేరకు నటించారు. క్లైమాక్స్‌లో బ్రహ్మాజీ పాత్ర ఆక‌ట్టుకుంటుంది. హీరోకి ఎలివేషన్‌ కావలసిన ప్రతి సందర్భంలోనూ కృష్ణ, మహేశ్‌బాబు సినిమాల్లో సన్నివేశాలను చూపించారు. కొంచెం కామెడీ, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌, యాక్షన్‌ను ఇష్టపడేవారికి న‌చ్చుతుంది ఈ సినిమా. ఓవ‌రాల్ గా చూస్తే అంచ‌నాలేమీ లేకుండా వెళితే హీరో సినిమా ఓకే.

2.5\5

Tags:    

Similar News