ఈ టైటిలే వెరైటీగా ఉంది. సినిమా టీజర్...ట్రైలర్ లు కూడా సినిమాపై ఆసక్తి పెంచేలా చేశాయి. అయితే ఈ సినిమా యూత్ ను టార్గెట్ చేసుకుని తెరకెక్కించిన విషయం హీరో సిద్ధూ జొన్నలగడ్డతోపాటు చిత్ర యూనిట్ పలుమార్లు ప్రకటించింది. రవితేజ ఖిలాడి విడుదల అయిన మరుసటి రోజే ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. విమల్ క్రిష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సిద్ధూకు జోడీగా నేహశెట్టి నటించింది. ఈ సినిమాకు మరో విశేషం ఉంది. దర్శకుడు విమల్ క్రిష్ణతో పాటు ఈ కథలో సిద్ధూ జొన్నలగడ్డ భాగస్వామ్యం ఉండటం విశేషం. సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఈ సినిమాను నిర్మించింది. పెద్దగా అంచనాలేమీ లేకుండా విడుదలైన ఈ సినిమా అదరగొట్టిందనే చెప్పాలి. ముఖ్యంగా యూత్ ను ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంటుందని అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. సిద్ధూజొన్నల గడ్డ తన పాత్రకు వందకు వంద శాతం న్యాయం చేశారు. నేహ శెట్టి కూడా అందంతోపాటు అభినయంతో కట్టిపడేసింది. సింపుల్ కథను అత్యంత ఆసక్తికరంగా తెరకెక్కించటంలో దర్శకుడు విమల్ క్రిష్ణ విజయవంతం అయ్యారనే చెప్పాలి. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన బాలగంగాధర్ తల్లిదండ్రులు పెట్టిన తన పేరును టిల్లుగా మార్చుకుంటాడు. తాను ఉండే ఏరియాలో జరిగే పంక్షన్లలో డీజె వాయిస్తూ స్నేహితులతో కలసి ఎంజాయ్ చేస్తుంటాడు. క్రమంగా ఎదుగుతూ ఎలాగైనా మ్యూజిక్ డైరక్టర్ కావాలనే లక్ష్యంతో పనిచేస్తుంటాడు. ఓ సారి ఓ పబ్ లో రాధిక( నేహ శెట్టి)ని కలుస్తాడు. అప్పటి నుంచి వీరిద్దరి పరిచయం..ప్రేమగా మారుతుంది. అయితే రాధిక తీరు చూసి టిల్లు ఎప్పటికప్పుడు ఆమెను అనుమానిస్తాడు.
ఆ సమయంలోనే రాధిక టిల్లుతో కలసి తిరుగుతున్న ఫోటోలను బయటపెట్టిన ఆమెతో సహజీవనం చేసే వ్యక్తిని హత్య చేస్తుంది రాధిక. ఆ సమయంలో ఇంటికి వచ్చిన టిల్లు కూడా ఇందులో ఇరుక్కుపోతాడు. అప్పటి నుంచి వీళ్ళిద్దరూ ఈ కేసు నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలు..మధ్యలో మరింత సమస్యల్లో కూరుకుపోతారు. వీరు సమస్య నుంచి ఎలా బయటపడతారు..మరి వీరి ప్రేమ కథకు ఎలాంటి ముగింపు పడుతుంది అన్నదే సినిమా. అసలు ప్రారంభం నుంచి ఎండింగ్ వరకూ టిల్లుగా సిద్ధూ జొన్నలగడ్డ ఫుల్ ఎనర్జీ చూపిస్తూ తనదైన స్టైల్ లో డైలాగ్ లు..యాక్షన్ తో కట్టిపడేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటూ సిద్ధూ జొన్నలగడ్డను చూస్తే ఈ సినిమాలో మరో విజయదేవరకొండను తలపించాడు. పస్టాఫ్ ఎంత వేగంగా పరుగెడుతుందో సెకండాఫ్ లోనూ అదే జోరు కన్పిస్తుంది. కాకపోతే ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ లో కాస్త నెమ్మదించినట్లు కన్పించినా గ్రిప్ మాత్రం సడలకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సినిమాకు ప్రధాన బలం సిద్ధూ జొన్నలగడ్డ, నేహశెట్టితోపాటు తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్. సన్నివేశాలకు అనుగుణంగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ద్వారా ఓ లెవల్ కు తీసుకెళ్ళాడు. ఒవరాల్ గా చూస్తే డీ జె టిల్లు యూత్ కు మాత్రం ఫుల్ గా నచ్చేస్తాడు.
రేటింగ్. 3.25\5