‘అన్నీ మంచి శకునములే’ మూవీ రివ్యూ

Update: 2023-05-18 08:40 GMT

సినిమా టైటిల్ లోనే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. అలాగని టైటిల్ బాగుంటే సినిమా బాగుండాలని రూల్ ఏమీ ఉండదు. ఈ సినిమా దర్శకురాలు నందిని రెడ్డి కావటం ఒకటి..చిత్ర నిర్మాణ సంస్థ ప్రముఖ నిర్మాత అశ్విని దత్ కుమార్తె స్వప్న దత్ కావటంతో దీనిపై ఒకింత అంచనాలు పెరిగాయి. అదే సమయంలో టాలీవుడ్ కు చెందిన పలువురితో ఈ సినిమా కు సంబంధించి ప్రమోషన్స్ చేయించి ‘అన్నీ మంచి శకునములే’ సినిమాకు హైప్ తీసుకురావటంలో విజయవంతం అయింది చిత్ర యూనిట్. ఈ సినిమా హీరో సంతోష్ శోభన్ గత కొంతకాలంగా ఒక మంచి హిట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఆయనకు సూపర్ హిట్ ఒకటి దక్కలేదు. సంతోష్ శోభన్ ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నారు. ఈ సినిమాలో ఆయనకు జోడిగా మాళవిక నాయర్ నటించింది. ఇక సినిమా కథ విషయానికి వస్తే ఆస్పత్రిలో మందుకొట్టి ఒకేసారి ఇద్దరు తల్లలకు ప్రసవం చేయించిన డాక్టర్ ఒకరి పిల్లలను ఒకరికి ఇవ్వటం, ఒక కాఫీ ఎస్టేట్ కు సంబంధించి రెండు ఫ్యామిలీ ల మధ్య నడిచే కేసు చుట్టూ తిరుగుతుంది సినిమా అంతా. కాఫీ ఎస్టేట్ కోసం గొడవ పడే ఒక ఫ్యామిలి లో హీరో...మరో ఫ్యామిలి లో హీరోయిన్ ఉంటారు. మరి ఈ సమస్య ఎలా పరిస్కారం అయింది...పుట్టినప్పుడే మారిన పిల్లల విషయం బయటకు ఎలా వచ్చింది అన్నదే సినిమా.

                                  ఈ సినిమాలో కథ అంతా కాఫీ ఎస్టేట్, కాఫీ పొడి చుట్టూనే తిరుగుతింది. దీంతో అక్కడక్కడా మిస్ ఇండియా సినిమా ప్రేక్షకులకు గుర్తుకు వస్తుంది. హీరో సంతోష్ శోభన్, హీరోయిన్ మాళవిక నాయర్ లు తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. వీళ్లిద్దరు ఎంతో ఈజ్ తో తమ పాత్రల్లో నటించారు. అయితే వీళ్ళ చిన్నప్పటి ప్రేమకథ...పెద్ద అయ్యాక ప్రేమకథలో ఎక్కడ పెద్దగా కొత్తదనం కనిపించదు. ఇతర కీలక పాత్రల్లో రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, వెన్నెల కిషోర్ లు సందడి చేశారు. సినిమాలో కథ ఏమంత ఆకట్టుకునేలా లేకపోయినా మధ్య మధ్యలో కథలో భాగంగానే కామెడీ ని జొప్పించి దర్శకురాలు నందిని రెడ్డి విజయవంతం అయ్యారు అనే చెప్పాలి. సినిమా క్లైమాక్స్ లో సెంటిమెంట్ సన్నివేశాలు కూడా బలంగా కనిపిస్తాయి. ఒక్కటంటే ఒక్క ఫైట్ కూడా లేకపోవటం, ఫ్యామిలీ ఆడియెన్స్ కు ఇబ్బంది కలిగించే అంశాలు ఏమీ లేకపోవటం సినిమా కు ప్లస్ అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ‘అన్నీ మంచి శకునములే’ ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే మూవీ.

                                                                                                                                                                                                                   రేటింగ్. 2 .75 /5


Tags:    

Similar News