టాలీవుడ్ కు చెందిన పలువురు హీరోలు బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇందులో విజయదేవరకొండతో పాటు రానా దగ్గుబాటి కూడా ఉన్నారు. నటుడు ప్రకాష్ రాజ్ ఇప్పటికే ఇదే కేసు లో ఈడీ ముందు హాజరు అయి తన వివరణ ఇచ్చారు. మంచు లక్ష్మి కి కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. బుధవారం నాడు హైదరాబాద్ లో హీరో విజయదేవరకొండ ఈడీ అధికారుల ముందు హాజరు అయి తన బ్యాంకు స్టేట్ మెంట్స్ ఈడీ అధికారులకు ఇచ్చినట్లు తెలిపారు. ఈడీ విచారణ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ప్రమోట్ చేసింది గేమింగ్ యాప్ తప్ప బెట్టింగ్ యాప్ కాదు అని..ఈ విషయంలో మీడియా సవరణ చేసుకోవాలన్నారు.
యాప్స్ లో రెండు రకాలు ఉన్నాయని ఇందులో గేమింగ్ యాప్స్ చట్టపరంగా అనుమతి ఉన్నవే అని తెలిపారు. తాను ప్రమోట్ చేసినా ఏ 23 గేమింగ్ యాప్ తెలంగాణాలో ఓపెన్ కూడా కాదు అన్నారు. ఈ గేమింగ్ యాప్స్‌కి జీఎస్టీ, ట్యాక్స్, అనుమతులతో పాటు రిజిస్ట్రేషన్స్ ఉంటాయన్నారు. దేశంలో గేమింగ్ యాప్స్ ఐపీఎల్, కబాడీ, వాలీబాల్‌కి స్పాన్సర్స్ గా ఉన్నారని వివరించారు. తాను లీగల్‌గా ఉన్న గేమింగ్ యాప్స్‌ను మాత్రమే ప్రమోట్ చేసినట్లు ఈడీ అధికారులకు వివరించానని ఆయన చెప్పారు. తాను ప్రమోట్ చేసిన గేమింగ్ యాప్ కంపెనీతో చేసుకున్న ఒప్పందం వివరాలు కూడా ఈడీకి ఇచ్చినట్లు తెలిపారు. ఇంతటితో సమాప్తం అంటూ విజయదేవరకొండ ఇక ఇందులో ఏమి లేదు అని సంకేతం ఇచ్చారు. బెట్టింగ్ యాప్స్ విషయంలో తన పేరు వచ్చింది కాబట్టి పిలిచారు అన్నారు.