సిరివెన్నెల‌కు నివాళి..త‌ర‌లివ‌చ్చిన టాలీవుడ్

Update: 2021-12-01 04:35 GMT

త‌ర‌లిరాని తీరాల‌కు వెళ్లిన ప్ర‌ముఖ సినీ గేయ‌ ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రికి నివాళులు అర్పించేందుకు టాలీవుడ్ త‌ర‌లివ‌చ్చింది. సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖ హీరోలు చిరంజీవి, వెంక‌టేష్‌, ద‌గ్గుబాటి రానా, నాని, అల్లు అర్జున్, బాలకృష్ణ , త్ర‌విక్ర‌మ్ శ్రీనివాస్, ఏపీ మంత్రి పేర్ని నాని, అల్లు అర‌వింద్ త‌దిత‌రులు నివాళులు అర్పించారు. సిరివెన్నెల అంత్య‌క్రియ‌లు మ‌హాప్ర‌స్థానంలో ఈ రోజు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు జ‌ర‌గ‌నున్నాయి. అభిమానుల సంద‌ర్శ‌నార్ధం ఆయ‌న భౌతిక‌కాయాన్ని ఫిలిం ఛాంబ‌ర్ కు తీసుకొచ్చారు. ఇక్క‌డ హీరో చిరంజీవి మాట్లాడుతూ సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి లేని లోటు పూడ్చ‌టం సాధ్యంకాద‌న్నారు. ఆయ‌న‌కు గుర్తుగా ఏమి చేయాల‌నే అంశంపై ప‌రిశ్ర‌మ‌లో అంద‌రితో చర్చించి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని తెలిపారు. మ‌రో హీరో బాల‌కృష్ణ మాట్లాడుతూ 'ఇది ఒక నమ్మలేని నిజం. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. తెలుగు భాషకి, సాహిత్యానికి ఒక భూషణుడు సిరివెన్నెల. తాను పుట్టిన నేలకి వన్నె తెచ్చిన వ్యక్తి ఆయన., సిరివెన్నెల లేరంటే చిత్ర పరిశ్రమ శోక సముద్రంలో ఉన్నట్లు ఉంది. సాకు సాహిత్యం అంటే ఇష్టం. మేం ఇద్దరం ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్లం. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు.

పుట్టినవారు గిట్టక తప్పదు.. కానీ 66 ఏళ్ళకి వెళ్ళారు' అంటూ బాలకృష్ణ కంటతడి పెట్టుకున్నారు. ప్రముఖ గాయ‌ని సునీత మాట్లాడుతూ 'సిరివెన్నెల సీతారామశాస్త్రి మొదటిసారి నిద్ర పోవడం చూస్తున్నాను. వరుస కథలు, ఆలోచనలతో బిజీగా ఉంటారు. ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నాను. చిన్న చిన్న పదాలతో ఎన్నో అర్థాలు చెప్పడం ఆయన సొంతం. మహానుభావుడు చరిత్ర సృష్టించి నిద్రలోకి జారుకున్నారు. సిరివెన్నెల చీకటి మిగిల్చి వెళ్లిపోయారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడ్ని కోరుకుంటున్నాను' అని పేర్కొన్నారు. అల్లు అర‌వింద్ మాట్లాడుతూ 'సరస్వతి పుత్రడు సిరివెన్నెల. మెన్నటి వరకు కూడా ఆయన ఎన్నో పాటలు రాశారు. మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ సినిమాకి కూడా పాటలు రాశారు. వేటూరి తర్వాత శకం ముగిస్తే...సిరివెన్నెల తర్వాత మరో శకం ముగిసింది. బన్నీ అంటే ఆయనకి విపరీతమైన ఇష్టం. ఎందుకో తెలియదు కానీ బన్నీతో గంటల తరబడి గడిపేవారు' అంటూ అల్లు అరవింద్‌ ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

Tags:    

Similar News