రాష్ట్ర ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూకు నిర్ణయం తీసుకున్న వేళ తెలంగాణ సినిమా థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి రాష్ట్రంలో థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించారు. వాస్తవానికి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్లో షోలను ఎనిమిది గంటలకు ముగించాలని మాత్రమే ఉంది. అదే సమయంలో కోవిడ్ నియంత్రణా చర్యలు పకడ్భందీగా తీసుకోవాలని మాత్రమే సూచించారు.
ఇతర రాష్ట్రాల తరహాలో 50 శాతం సామర్ధ్యం మాత్రమే అనుమతిస్తామని కూడా నిబంధన పెట్టలేదు. అయినా సరే థియేటర్ల యాజమానులు పెరుగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి, ప్రేక్షకుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. థియేటర్లతోపాటు మల్టీప్లెక్స్ లు కూడా మూతపడనున్నాయి. దీంతో ఈ నెల 23న విడుదల కావాల్సిన ఇష్క్ తోపాటు మరికొన్ని సినిమాల విడుదల వాయిదా పడటం అనివార్యంగా మారింది.