ఆర్ఆర్ఆర్ కు 'బిగ్ షాక్ '!

Update: 2021-12-25 04:20 GMT

ఓ వైపు ఏపీ టెన్ష‌న్..ఇప్పుడు మ‌హారాష్ట్ర‌లో 50 శాతం ఆక్యుపెన్సీకే అనుమ‌తి

ఆర్ఆర్ఆర్ మూవీకి సినిమా క‌ష్టాలు త‌ప్ప‌టం లేదు. ఇప్ప‌టికే ప‌లుమార్లు వాయిదాల మీద వాయిదాలు ప‌డుతూ వ‌స్తున్న ఈ మూవీ ఎట్ట‌కేల‌కు జ‌న‌వ‌రి 7న విడుద‌ల అవుతుంద‌ని ప్ర‌క‌టించారు. అంతా బాగానే ఉంద‌నుకున్న స‌మ‌యంలో ఒమిక్రాన్ వేరియంట్ టెన్ష‌న్ ప్రారంభం అయింది. అక‌స్మాత్తుగా ఈ కేసుల సంఖ్య పెరుగుతుండ‌టంతో ప‌లు రాష్ట్రాలు ఆంక్షలు పెట్ట‌డం ప్రారంభించాయి. మ‌హారాష్ట్ర స‌ర్కారు తాజాగా థియేట‌ర్ల‌లో 50 శాతం సామ‌ర్ధ్యానికే అనుమ‌తి ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇది ఆర్ఆర్ఆర్ టీమ్ కు ఏ మాత్రం మింగుడు ప‌డ‌ని ప‌రిణామ‌మే. అసలే ఏపీలో సినిమా టిక్కెట్ ధ‌ర‌ల టెన్ష‌న్ ఆర్ఆర్ఆర్ టీమ్ ను వేధిస్తోంది. హిట్ టాక్ తెచ్చుకున్న అఖండ‌, పుష్ప సినిమాల బ‌య్య‌ర్లు కూడా ఏపీలో న‌ష్టాల పాలు అవుతున్న‌ట్లు ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు చెబుతున్నాయి. అదే తెలంగాణ‌లో మాత్రం బ‌య్య‌ర్లు మాత్రం లాభాల బాట‌లో న‌డుస్తున్నారు. కార‌ణం ఏపీలోని ప‌లు థియేట‌ర్ల‌లో టిక్కెట్ రేట్లు మ‌రీ త‌క్కువ‌గా ఉండ‌ట‌మే. ఓ వైపు ఆర్ఆర్ఆర్ టీమ్ ఎలా ఏపీ టిక్కెట్ల టెన్ష‌న్ నుంచి బ‌య‌ట‌ప‌డాలా అని ప్ర‌య‌త్నం చేస్తున్న త‌రుణంలో అక‌స్మాత్తుగా ఇప్పుడు మ‌హారాష్ట్ర టెన్ష‌న్ ప్రారంభం అయింది.

ఏపీలో టిక్కెట్ రేట్ల అంశం ఓ కొలిక్కి తెచ్చేందుకు తెర‌వెన‌క ప్ర‌య‌త్నాలు జోరుగా సాగుతున్నాయి. అయితే ఏపీ మంత్రుల వ్యాఖ్య‌లు చూస్తుంటే ఇది ఏ మేర‌కు ఫ‌లితాన్ని ఇస్తుందో వేచిచూడాల్సిందే. పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల కార‌ణంగా ప‌లు రాష్ట్రాలు రాత్రి క‌ర్ఫ్యూలు అమ‌ల్లోకి తెస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ తో పెద్ద ప్ర‌మాదం లేక‌పోయినా ఈ వైర‌స్ డెల్టా కంటే చాలా వేగంగా వ్యాపిస్తుంది అన్న‌దే టెన్ష‌న్ కు కార‌ణం అవుతోంది. మ‌రి ఏపీలో టిక్కెట్ ధ‌ర‌ల అంశం ఓ వైపు, ఇప్పుడు మహారాష్ట్ర‌లో థియేట‌ర్ల‌లో 50 శాతం ఆక్యుపెన్సీ అంటే ఇది మరింత దారుణంగా మారుతుంది. ఏపీ స‌మ‌స్య‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకునే ఆర్ఆర్ఆర్ టీమ్ అతి పెద్ద మార్కెట్ అయిన హిందీపై ఎక్కువ ఫోక‌స్ పెట్టింది. ప్ర‌మోష‌న్లు కూడా అక్క‌డే ఎక్కువ‌గా చేస్తోంది. తాజాగా చోటుచేసుకుంటున్న ప‌రిణామాలు ఎటువైపు దారితీస్తాయో వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News