రాజమౌళి సినిమా ఈ సారి గతంలో ఎన్నడూలేని రీతిలో వివాదాల్లో చిక్కుకుంటోంది. ముఖ్యంగా కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ ను చూపించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, ఆ పార్టీ ఎంపీ సోయం బాబూరావులు ఎంత ఘాటు విమర్శలు చేసినా ఆర్ఆర్ఆర్ టీమ్ మాత్రం దీనిపై అధికారికంగా ఎక్కడా స్పందించలేదు. ఇన్ని రోజుల్లో వివాదాల్లో నానిన ఈ సినిమా ఇప్పుడు పండగ మూడ్ తెచ్చింది.
దీపావళిని పురస్కరించకుని చిత్ర యూనిట్ దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కూర్చుని మాట్లాడుకుంటున్న ఫోటోను విడుదల చేసింది. ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ.. అందరి జీవితాల్లో ఈ దీపావళి మరిన్ని వెలుగులు నింపాలని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ ఫోటోలో ముగ్గురు సంప్రదాయ దుస్తుల్లో చిరునవ్వులు చిందిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.