ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాల్లో ఆకాశంలో ఒక తార మూవీకి మంచి బజ్ క్రియేట్ అయింది. దీనికి చాలానే కారణాలు ఉన్నాయి. ఈ సినిమాను సమర్పించింది ప్రముఖ నిర్మాణ సంస్థలు అయిన గీత ఆర్ట్స్, స్వప్న సినిమాస్ కావటం ఒకటి అయితే...ఇందులోని నటీనటులు కూడా సినిమాపై ఒక మంచి ఫీల్ తీసుకురావటంలో సక్సెస్ అయ్యారు. హీరో దుల్కర్ సల్మాన్ కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఇటీవల విడుదల అయిన ఐయామ్ గేమ్ మూవీ తప్ప దుల్కర్ గత సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను దక్కించుకున్నాయి. మరో వైపు హీరోయిన్ సాత్విక వీరవల్లి కూడా ఈ మూవీ పై అంచనాలు పెంచటానికి కారణం అయింది. టీజర్...ట్రైలర్ ల్లో ఆమె మాటలు..యాక్షన్ చూసి ఈ మూవీపై చాలా మంది ఒక అంచనాకు వచ్చారు. పాజిటివ్ బజ్ ఉన్న ఈ సినిమా విడుదల శుక్రవారం అయినా కూడా గురువారం రాత్రి ప్రీమియర్ షోస్ వేశారు. కనీసం సరైన రోడ్డు సౌకర్యం కూడా లేని ఒక గ్రామంలో పుట్టిన కల్పన అనే అమ్మాయి ఏకంగా ఆస్ట్రోనాట్ కావాలనే కల కనటం...అది నెరవేర్చుకోవడం అంటే జరిగే పనేనా?. అలాంటి కష్టమైన లక్ష్యాన్ని ఎలా అందుకున్నది? అన్నదే ఈ మూవీ.
పదవ తరగతి లో జిల్లా ఫస్ట్ వచ్చినా కూడా ఆమె కలను ఏ మాత్రం పట్టించుకోకుండా పెళ్లి చేసి పంపిస్తారు కల్పన తల్లితండ్రులు. సొంతంగా కారు కొనుక్కుని ట్రావెల్స్ పెట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న కల్పన భర్త కృష్ణ పాత్రలో నటించిన దుల్కర్ సల్మాన్ ఆమెకు ఎలాంటి సాయం చేశాడు అన్నదే కథ. దర్శకుడు పవన్ సాధినేని ఈ మూవీ విషయంలో కథ నుంచి ఏ మాత్రం పక్కకు తప్పకుండా సినిమాను నడిపించాడు. ఇందులో చాలా వరకు విజయం సాధించాడు అనే చెప్పాలి. ఆకాశంలో ఒక తార మూవీ లో హై లైట్ అంటే హీరోయిన్ సాత్విక వీరవల్లి నటనే అని చెప్పాలి. అమెరికాలో పుట్టి పెరిగిన సాత్విక వీరవల్లి అచ్చమైన పల్లెటూరి అమ్మాయిలా...తన డ్రీం కోసం తపనపడే పాత్రలో చాలా బాగా నటించింది. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాను నడిపించింది ఆమె పాత్రే.
హీరో దుల్కర్ సల్మాన్ తన భార్య కల ఏంటో తెలుసుకుని...దీని కోసం తన ప్లాన్స్ ను కూడా పక్కనపెట్టి భార్యకు సహకరిస్తారు. ఈ విషయంలో సొంత అక్క నుంచి విమర్శలు ఎదురైనా ఏ మాత్రం పట్టించుకోకుండా ముందుకు వెళతాడు. ఉన్నత చదువులు చదివేందుకు తన భార్యకు అవసరమైన డబ్బులు సంపాదించేందుకు బొగ్గు గనుల్లో డ్రైవర్ గా పని చేయటానికి గుజరాత్ కు వెళతాడు. అక్కడే రుహాని శర్మతో పరిచయం అవుతుంది. రుహాని శర్మ కృష్ణపై ప్రేమ పెంచుకుంటున్న విషయం గ్రహించి తనకు పెళ్లి అయింది అని..తాను గుజరాత్ లో పని చేయటానికి ఎందుకు వచ్చింది చెపుతాడు. ఈ సినిమాలో ఒక స్పేస్ కంపెనీ ఓనర్ గా శృతి హాసన్ కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా కథ ముందుకు నడవటంలో ఆమెది కూడా కీలక పాత్రే. ఈ సినిమాలో కథలో భాగంగా వచ్చే పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఆకాశంలో ఒక తార సినిమాలో సంభాషణలు..ఎమోషన్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయి. ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో గౌతమ్ మీనన్, మురళి శర్మ లు నటించారు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చే సినిమా ఇది. రెగ్యులర్ మూవీ టెంప్లేట్స్ అలవాటుపడిన వాళ్లకు అంతగా నచ్చకపోవచ్చు.
రేటింగ్ : 3 /5