సినీ పరిశ్రమలో సెంటిమెంట్స్ చాలా బలంగా నమ్ముతారు. ఇతర పరిశ్రమల్లో సెంటిమెంట్స్ ఉండవు అని కాదు..కానీ ఇక్కడ నమ్మినంత బలంగా ఇతర చోట్ల ఉండవు అనే చెప్పొచ్చు. ఒక నటుడికి ఒక పాత్ర పేరు తెచ్చిపెడితే చాలు అది ఇక అలాగే కొనసాగుతూ ఉంటుంది. ఆ మనిషి లో ఎంత టాలెంట్ ఉన్నా ఆ కోణంలో ఆలోచించకుండా అదే ట్రెండ్ ని ఫాలో అవుతారు....అలా అయితే అయితేనే తమకు హిట్ వస్తుంది అని బలంగా నమ్ముతారు కూడా. ఇలాంటి ఎన్నో విషయాలను టచ్ చేస్తూ సాగుతుంది ఈ నగరానికి ఏమైంది రిపీట్ మూవీ. ఈ సినిమా స్టోరీ అంతా కూడా సినిమా నిర్మాణం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ నగరానికి ఏమైంది మూవీ 2018 జూన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అప్పటి లెక్కల ప్రకారం మంచి ఫలితమే సాధించింది. కాకపోతే డిజిటల్ స్ట్రీమింగ్....రీ రిలీజ్ తో ఈ సినిమాకు మరింత క్రేజ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ నగరానికి ఏమైంది రిపీట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది . సినిమా విడుదల గురువారం నాడే అయినా కూడా బుధవారం రాత్రే పెయిడ్ ప్రీమియర్ షోస్ వేశారు.
ఫస్ట్ పార్ట్ లో ఉన్న ఫ్రెండ్స్ టీం ఈ రిపీట్ లో కూడా కీలక పాత్రలు పోషించారు. సినిమా ఎక్కువ శాతం విశ్వక్ సేన్, మాగంటి శ్రీనాథ్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమానుల మీదే సాగుతుంది. దర్శకుడు ఇందులో కథ కంటే కూడా కథనంపైనే దృష్టి సారించాడు. ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశాడు. ఏ సినిమాకు అయినా ఫస్ట్ పార్ట్ తర్వాత రెండవ పార్ట్ పై అంచనాలు నిలుపుకోవటం ఒకింత సవాల్ తో కూడుకున్న విషయమే. అయితే దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ ఎన్ఈ రిపీట్ తో కూడా అదే మేజిక్ చేశాడు అని చెప్పొచ్చు. ఇందులో కూడా నలుగురి ఫ్రెండ్స్ మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయింది. ఒక్క మాటలో చెప్పాలంటే బలమైన నాలుగు పాత్రలు సృష్టించి వాటి చుట్టూ సినిమాను నడపడానికి సరిపడే రీతిలో మూవీని డ్రైవ్ చేశాడు దర్శకుడు. ముఖ్యంగా ప్రధాన పాత్రలు, వాటి మాటలు యూత్ ను టార్గెట్ గా చేసుకుని ట్రెండీగా ప్లాన్ చేశారు. విశ్వక్ సేన్ తనకు అలవాటు అయిన పాత్ర కావటంతో ఇందులో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ మూవీతో హిట్ దక్కించుకున్నాడు.
ఫస్ట్ పార్ట్ లో తనదైన కామెడీ తో ఆకట్టుకున్న అభినవ్ గోమఠం ఈ సారి కూడా తనదైన ముద్ర వేశాడు సినిమాపై. ముఖ్యంగా అడవిలో జరిగే సన్నివేశాలు, అందులోనూ ఎలుగుబంటితో ఆయనకు ఎదురయ్యే అనుభవం సినిమాలో మంచి కామెడీ పండించింది. తాము చేస్తున్న సినిమా విడుదల అయ్యేది కాదు అని పదే పదే చెపుతూ ఉంటాడు అభినవ్ ఇందులో. దీంతో బ్యాంకాక్ షూటింగ్ లో ఆయన ప్లేసులో డూప్ ని పెట్టి షూట్ చేస్తారు. ఈ రోల్ లో నటించిన మహేష్ చింతల తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. సినిమాలో ఈ రోల్ హై లైట్ గా నిలుస్తుంది. హీరోయిన్లు అనీషా అంబ్రోస్ కంటే శివాత్మిక రాజశేఖర్ కు మంచి పాత్ర దక్కింది. ప్రియదర్శిని రామ్ కీలక పాత్రలో కనిపిస్తాడు. యూత్ ను టార్గెట్ గా చేసుకుని తెరకెక్కించిన ఈ మూవీ వాళ్ళను ఫుల్ ఎంగేజ్ చేయటంలో సక్సెస్ అయింది. అక్కడక్కడా కొంత స్లోగా ఉన్న ఫీలింగ్ కలిగినా ఓవర్ అల్ గా చూస్తే ఈ నగరానికి ఏమైంది మూవీ రిపీట్ మంచి ఎంటర్టైనర్ గా నిలుస్తుంది. ఇందులో ప్రేక్షకులు ఊహించని కొన్ని క్యామియోలు కూడా ఉన్నాయి.