అర్హత లేకపోయినా ఎలా అనుమతి ఇచ్చారు!

Update: 2025-03-25 11:10 GMT
అర్హత లేకపోయినా ఎలా అనుమతి ఇచ్చారు!
  • whatsapp icon

నితిన్ హీరో గా తెరకెక్కిన రాబిన్ హుడ్ సినిమాలో స్టోరీ లైన్ సంపన్నుల ఇళ్లలో డబ్బును హీరో దోచుకుంటూ ఉంటాడు. ఈ సినిమా టీజర్ లో అదే చూపించారు. కానీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మాత్రం టికెట్ రేట్ల పెంపు పేరుతో ఆంధ్ర ప్రదేశ్ లో సినిమా అభిమానుల జేబుల నుంచి మూవీ మేకర్స్ దోచుకోవడానికి వీలు కల్పించింది. అసలు ఏ మాత్రం అర్హత లేకపోయినా కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా కు ఏపీలో రేట్లు పెంచుకోవటానికి అనుమతి ఇస్తూ ప్రభుత్వం మెమో జారీ చేయటం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఎలా చూసినా..అంటే ఏ ప్రమాణాల ప్రకారం కూడా నితిన్, శ్రీ లీల జంటగా నటించిన రాబిన్ హుడ్ సినిమా రేట్ల పెంపుకు మార్గదర్శకాలు ఒప్పుకోవు. ఎందుకంటే గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 13 ప్రకారం అయితే బడ్జెట్ వంద కోట్ల రూపాయలు దాటి ఉండటంతో ఆంధ్ర ప్రదేశ్ లో కొంత మేర షూటింగ్ చేసి ఉండాలి అనే నిబంధన పెట్టారు.

                                                             కానీ తొలి కేటగిరి అంటే బడ్జెట్ విషయంలో చూస్తే మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కించిన ఈ రాబిన్ హుడ్ సినిమా ఏ మాత్రం సెట్ కాదు. అయినా సరే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఈ సినిమా కు ప్రస్తుతం ఉన్న రేట్ల కు అదనంగా సింగిల్ స్క్రీన్స్ లో జీఎస్టీ తో కలుపుకుని ఏభై రూపాయలు...మల్టీప్లెక్స్ ల్లో జీఎస్టీ తో కలుపుకుని 75 రూపాయలు పెంచుకోవటానికి అనుమతి ఇచ్చారు. అది కూడా వారం రోజుల పాటు ఈ పెంపు అమలులో ఉంటుంది అని మెమో లో స్పష్టం చేశారు. అయితే ఈ విషయం దుమారం రేపటంతో మైత్రి మూవీ మేకర్స్ ఒక వివరణ విడుదల చేసింది. ఆంధ్ర ప్రదేశ్ లోని ఎంపిక చేసిన ప్రీమియం లొకేషన్స్ లోనే రేట్లు పెంచుతున్నాం తప్ప..అన్ని చోట్ల కాదు అని..ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణ లోనే ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్లకే మంచి ఎంటర్ టైన్మెంట్ ఇన్వలనేది తమ ఉద్దేశం అంటూ ఒక ప్రకటన విడుదల చేసింది.

                                                         అయితే ప్రభుత్వం విడుదల చేసిన మెమోలో మాత్రం ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని థియేటర్స్, మల్టీ ప్లెక్స్ ల్లో రేట్లు పెంపు వర్తిస్తుంది అని స్పష్టంగా పేర్కొన్నారు. అయినా సరే మైత్రి మూవీ మేకర్స్ వెరిఫై చేసుకోకుండా రాస్తున్న వార్తలు నిరాధారం అంటూ పేర్కొంది. అయితే మైత్రి మూవీ మేకర్స్ కు ప్రభుత్వంలోని పెద్దలతో ఉన్న సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకుని ఈ మెమో తెచ్చుకున్నారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇది వివాదం కావటంతో ఇప్పుడు ఈ ప్రకటన ఇచ్చారు అని చెపుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నిర్మాతలు కూడా మైత్రి మూవీ మేకర్స్ కావటం విశేషం. మరో వైపు ఈ సినిమా హీరో నితిన్ ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. మరో వైపు సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖ కూడా జనసేన కు చెందిన మంత్రి కందుల దుర్గేష్ దగ్గరే ఉంది. అస్మదీయులు అయితే చాలు అర్హత లేని సినిమా పేరుతో కూడా ప్రేక్షకుల జేబుకు చిల్లు పెట్టే వీలు కల్పించటం వెనక ఎవరు ఉన్నారు అనే చర్చ సాగుతోంది.

Tags:    

Similar News