రవి తేజ హీరో గా నటించిన ఇరుముడి సినిమా వంద కోట్ల రూపాయల క్లబ్ లో చేరింది. కేవలం నాలుగు అంటే నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించటం విశేషం. రవి తేజ కెరీర్ లోనే ఒక సినిమా ఇంత వేగంగా వంద కోట్ల క్లబ్ లో చేరటం ఇదే మొదటి సారి. అయ్యప్ప స్వామి ఆశీస్సులు...ప్రేక్షకుల ప్రేమతోనే ఇది సాధ్యం అయింది అంటూ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వంద కోట్ల రూపాయల పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ఎంత బాగున్న సినిమా విషయంలో అయినా కూడా కొంత మంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు. కానీ ఇరుముడి విషయానికి వస్తే మాత్రం ఎక్కువ మంది ఈ సినిమా సూపర్ హిట్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ సినిమాలో రవి తేజ కు జోడిగా ప్రియా భవాని శంకర్ నటించింది.