రవిబాబు సంచలన వ్యాఖ్యలు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల రాజకీయం రోజుకో కొత్త ట్విస్ట్ తీసుకుంటోంది. మంగళవారం నాడు పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంపై ప్రకాష్ రాజ్, మంచు విష్ణులు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోగా..బుధవారం నాడు ప్రముఖ నటుడు, దర్శకుడు రవిబాబు కొత్త ట్విస్ట్ ఇచ్చారు. మన సినిమాలు తీసేవాళ్ళు మన క్యారెక్టర్ ఆర్టిస్టులను వదిలేసి బయట భాషలను వాళ్లను తీసుకొచ్చి వేషాలు ఇచ్చి..వారి డిమాండ్లు అన్నీ ఒప్పుకుని షూటింగ్ లు చేయించుకుంటున్నారని విమర్శించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు..అందులో రవిబాబు వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే...'డబ్బులు ఎవరు పెడితే వారి ఇష్టం కదా. బహుశా మన క్యారెక్టర్ అర్టిస్ట్ లు వాటికి సూట్ అవ్వరేమో. హైదరాబాద్ సిటీలో దాదాపు 150 నుంచి 200 మంది కెమెరామెన్స్ పనిలేకుండా ఇంట్లో కూర్చుని ఉన్నారు. కానీ మన సినిమాలు తీసేవాళ్ళు..బయట భాషల కెమెరామన్లను తీసుకొచ్చి వారితో షూటింగ్స్ చేయించుతున్నారు.
చివరకు మేకప్ మెన్స్, హెయిర్ డ్రెస్సర్స్ కూడా బాంబే నుంచో అక్కడ నుంచో ఎక్కడ నుంచో తీసుకొస్తున్నారు. మన మూవీ ఆర్టిస్ట్స్ అందరం కలసి మా అనే చిన్న ఆర్గనైజేషన్ పెట్టుకున్నాం. మన సమస్యలు పరిష్కరించుకోవటానికి. వేరే ప్రొడ్యూసర్స్, డైరక్టర్స్ తో ఇబ్బంది వస్తే వాళ్లతో చర్చించటానికి మనం ఇది పెట్టుకున్నాం. ఇలాంటి ఒక చిన్న ఆర్గనైజేషన్ ను రన్ చేయటానికి కూడా మనలో ఒకడు పనికిరాడా..దీనికి కూడా మనం బయట నుంచి మనుషులును తెచ్చుకోవాలా. ఒక్కసారి ఆలోచించి చూడండి. మళ్లీ చెబుతున్నా. ఇది లోకల్..నాన్ లోకల్ ఇష్యూ కాదు. ఇది మన ఆర్గనైజేషన్.. మనం నడుపుకోలేమా?. చేతకాదా. బయట నుంచి ఎవరో వచ్చి మనకు నేర్పించాలా. కొంచెం అలోచించండి' అంటూ పేర్కొన్నారు.