పవన్ కళ్యాణ్ @ నాలుగు సినిమాలు..రెండు ఎన్నికలు

Update: 2023-01-31 07:48 GMT

Full Viewజనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల లోపే అయన తన చేతిలో ఉన్న నాలుగు సినిమాలు పూర్తి చేస్తారా?. అది సాధ్యం అవుతుందా అన్న చర్చ సాగుతోంది. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న హర హర వీర మల్లు సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ సినిమా విడుదల కూడా ఈ ఏడాదే ఉంటుంది. అది కూడా మార్చిలోనే విడుదల చేయాలని ప్రతిపాదించారు. ఇప్పుడు ఓజీ పేరుతో కొత్తగా సినిమాకు శ్రీకారం చుట్టారు. ఓజి అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను సుజీత్ దర్శకత్వం వహిస్తుందా...డీవీవీ ఎంటర్ టైన్మెంట్ తెరకెక్కిస్తోంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు జనవరి 30 న హైదరాబాద్ లో జరిగిన విషయం తెలిసిందే. ఈ లెక్కన చూస్తే హర హర వీర మల్లు తర్వాత పవన్ కళ్యాణ్ ఓజీ షూటింగ్ లోనే పాల్గొనే అవకాశం ఉంది అని చెపుతున్నారు. ఇవి కాకుండా మరో సినిమా సముద్ర ఖని తో...ఇంకో సినిమా హరీష్ శంకర్ తో కలిసి చేయనున్నారు. హరీష్ శంకర్ సినిమాకు తొలుత భవదీయుడు భగత్ సింగ్ టైటిల్ ఫిక్స్ చేసి...తర్వాత దీన్ని ఉస్తాద్ భగత్ సింగ్ గా మార్చిన విషయం తెలిసిందే.

                                  మరి ఈ సినిమాలు అన్ని ఈ ఒక్క ఏడాదిలోనే పూర్తి అవుతాయా లేదా అన్నది వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఈ సారి జనసేన ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవనున్న విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం చూస్తే తెలంగాణ లో 2023 అక్టోబర్-నవంబర్ ల మధ్య జరగాల్సి ఉంది. అదే ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే అక్కడ 2024 మార్చి -ఏప్రిల్ మధ్య ఎన్నికలు పూర్తి అవ్వాల్సి ఉంది. ఈ లెక్కన రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు...ఏకంగా నాలుగు సినిమాలు మేనేజ్ చేయటం అంటే ఒకింత కష్టమే మరి. పవన్ కళ్యాణ్ మరి వీటిని ఎలా డీల్ చేస్తారో చూడాలి. తన సినిమాల విషయంలో పలు మార్లు పవన్ కళ్యాణ్ బహిరంగంగా స్పందించిన విషయం తెలిసిందే. తనకు ఇతర నేతల్లా వ్యాపారాలు లేవని..అందుకే రాజకీయాల్లో ఉండాలంటే సినిమాలు చేయాల్సిందే అంటూ పలు మార్లు చెప్పారు.

Tags:    

Similar News