ఒకప్పుడు టాలీవుడ్ లో పౌరాణిక పాత్రలు అంటే ఫస్ట్ గుర్తుకు వచ్చే పేరు ఎన్టీఆర్. ఆయన చేసినన్ని పౌరాణిక పాత్రలు మరెవరు చేసి ఉండరేమో. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా అంటేనే అంచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి. అలాంటిది వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఎన్టీఆర్ ఫస్ట్ టైం ఒక పూర్తి స్థాయి పౌరాణిక సినిమా చేస్తున్నారు అంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ కొన్ని సినిమాల్లో అప్పుడప్పుడు పౌరాణిక టచ్ ఇచ్చినా కూడా ఇది పూర్తి స్థాయి సినిమా కాబోతోంది. ఇప్పటికే ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లు అరవింద సమేత వీరరాఘవ సినిమా చేసిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక పౌరాణిక సినిమా రాబోతున్నట్లు నిర్మాత నాగవంశీ హింట్స్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమా విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కార్తికేయుడిగా కనిపించనున్నారు.
అటు నిర్మాణ సంస్థ తో పాటు ఎన్టీఆర్ కూడా ఈ కొత్త మూవీ అప్ డేట్ ను షేర్ చేశారు. శివుడి కుమారుడు...పార్వతి దేవికి గర్వకారణం, దేవ సేనాని ..మరో సారి త్రివిక్రంతో అంటూ ఎన్టీఆర్ పోస్ట్ చేశారు. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మైథలాజికల్ అంశాలతో ఓ భారీ పాన్ ఇండియా సినిమాను రూపొందిస్తున్నట్లు మేకర్స్ ఓ థీమ్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఎస్.రాధాకృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఫస్ట్ టైం చేయనున్న ఈ పూర్తి స్థాయి పౌరాణిక సినిమాలో ఇతర నటీనటులు ఎవరు అన్నది ఇంకా తేలాల్సి ఉంది.