నచ్చితే అభినందనలు తెలపాలి. నచ్చకపోతే వదిలేయాలి. సహజంగా ఎవరైనా చేసే పని ఇది. కానీ బాలీవుడ్ రామ్ గోపాల్ వర్మగా మారిన కంగనా రనౌత్ తాజాగా డొనాల్డ్ ట్రంప్ తరహాలో చాలానే నోటి దూల చూపించారు. కొత్తగా ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. 'జో బైడెన్ ఏడాదికి మించి ఉండరు. ఆయనకు అందిస్తున్న మెడిసిన్స్ ప్రకారం చూస్తే ఇదే జరుగుతోంది. ఐదు నిమిషాలకు ఒకసారి ఆయన డాటా క్రాష్ అవుతుంది. బైడెన్ ఓ గజని. తర్వాత షో మొత్తాన్ని కమలా హ్యారిష్ నడిపించడం ఖాయం' అంటూ ట్వీట్ చేశారు. ఒక మహిళ ఎదిగినప్పుడు ఆ మహిళ ఇతర మహిళలకు మార్గాన్ని చూపిస్తుందంటూ కమలా హ్యారిస్‌పై ప్రశంసలు జల్లు కురిపించారు. కమలా హ్యారిస్ పై ప్రశంసల వర్షం కురిపించటానికి ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు. కానీ జో బైడెన్ విషయంలో కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా అభ్యంతరకరమైనవే అన్న విమర్శలు విన్పిస్తున్నాయి.
జో బైడెన్ ఇంకా అధికార పగ్గాలు కూడా చేపట్టలేదు. కానీ ఇంతలోనే కంగనా రనౌత్ అనుచిత వ్యాఖ్యలు చేయటం ఏమిటనే నెటిజన్లు విమర్శిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు అయిన అతి పెద్ద వయస్సు (77 సంవత్సరాలు) ఉన్న వ్యక్తి జో బైడైన్. కానీ ఆయన ఎక్కడా వయసు పైబడిన వాడిలా కన్పించటం లేదు. దూకుడు చూపిస్తూనే ఉన్నారు. ప్రెసిడెంట్ ఎలక్ట్ గా నిర్ధారణ అయిన తర్వాత ఓ సభలో మాట్లాడుతూ ఆయన పరుగులు పెట్టిన వీడియోని కంగనా రనౌత్ చూసిందో లేదో మరి. మహారాష్ట్ర విషయంలోనూ ఆమె అవసరమైన, అనవసరమైన వాటి అన్నింటిలో తలదూర్చి విమర్శలు చేస్తూ వివాదాలు కొనితెచ్చుకుంటోంది.