సినిమా టిక్కెట్ రేట్ల పెంపుతో పాటు టాలీవుడ్ కు చెందిన పలు అంశాలపై సీఎం జగన్ దగ్గర తాడేపల్లిలో గురువారం నాడు జరిగిన సమావేశానికి ప్రముఖ హీరో ఎన్టీఆర్ డుమ్మా కొట్టారు. వాస్తవానికి సీఎం జగన్ ను కలిసే టీమ్ లో ఎన్టీఆర్ పేరు ఉన్నట్లు భారీగా ప్రచారం జరిగింది. కానీ ఆయన మాత్రం ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి మహేష్ బాబు, ప్రభాస్ లు కూడా గతంలో ఎప్పుడూ ఇలాంటి సమావేశాలకు హాజరు కాలేదు. కానీ ఈ సారి సీఎం జగన్ తో భేటీకి వీరిద్దరూ హాజరయ్యారు. త్వరలోనే ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కానుంది. ఈ తరుణంలో సీఎం జగన్ దగ్గర జరిగిన సమావేశానికి ఎన్టీఆర్ హాజరు అయితే టీడీపీ శ్రేణుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చేదనే..ఇదే కారణంతో ఆయన దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు.
కొద్ది రోజుల క్రితమే అసెంబ్లీ వేదికపై కొంత మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు భార్య భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని రచ్చ జరిగిన సమయంలోనూ ఎన్టీఆర్ విడుదల చేసిన వీడియోపై తెలుగుదేశం పార్టీ నేరుగా ఎన్టీఆర్ పై ఎటాక్ చేశారు. . ఎన్టీఆర్ ఏదో ఆది, సింహాద్రిలా వస్తారని తాము అనుకుంటే ఆయన ఓ ప్రచనకారుడిలా మాట్లాడారు అంటూ టీడీపీ నేతలు ఎన్టీఆర్ పై విమర్శలు గుప్పించారు. ఈ తరుణంలో ఎన్టీఆర్ జగన్ దగ్గర జరిగిన సమావేశానికి హాజరైతే ఇబ్బంది ఎదురవువుతుందనే కారణంతోనే ఆయన దూరంగా ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. నాగార్జున మాత్రం తన కుటుంబ సభ్యుల్లో ఒకరికి కరోనా కారణంగా దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు.