కరోనా సమయంలో తన సేవల ద్వారా దేశ వ్యాప్తంగా ప్రజల ప్రశంసలు అందుకున్న ప్రముఖ నటుడు సోనూ సూద్ నివాసం, ఆయనకు సంబంధించిన కార్యాలయాలపై బుధవారం నాడు ఐటి దాడులు జరిగాయి. తాజాగా ఆయన ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు. ఇది జరిగిన కొద్ది రోజులకే ఆయన పై ఐటి దాడులు జరగటం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆప్ కు కూడా ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది.సోనూసూద్ కు సంబంధించిన ఆరు ప్రదేశాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయనకు చెందిన ముంబయ్ లోని వివిధ నివాసాలు, కార్యాలయాల వద్ద ప్రస్తుతం సోదాలు సాగుతున్నాయి.
ఆయనకు సంబంధించిన అకౌంట్స్ బుక్స్‌లో జరిగిన అవకతవకలను దృష్టిలో ఉంచుకునే ఐటీ శాఖ ఈ చర్యలు చేపట్టినట్టు చెబుతున్నారు. సోనూ సూద్ ఈ మధ్యే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో కలసి మీడియా ముందుకొచ్చారు. ఆయన ఆప్ ప్రభుత్వం స్కూలు పిల్లల కోసం చేపట్టిన దేశ్ కె మెంటార్స్ ప్రత్యేక కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. కొన్ని నెలల క్రితం, ముంబయ్ మున్సిపల్ అధికారులు కూడా సోనూసూద్ పై ఫిర్యాదు నమోదు చేశారు. ఆయన ఆరు అంతస్థుల నివాస భవనాన్ని తగిన అనుమతులు లేకుండానే హోటల్‌గా మార్చాడంటూ వారు ఆరోపించిన విషయం తెలిసిందే.