ప్లీజ్..గాడ్ ఫాదర్ ను ఆదరించండి..ఆశీర్వదించండి. ఇది మెగాస్టార్ చిరంజీవి అనంతపురంలో జరిగిన ఈ సినిమా ప్రీ రీలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు. ప్రతి సినిమాను ఆదరించాలని ఆయా సినిమాల్లో నటించిన హీరోలు..దర్శకులు..నిర్మాతలు కోరుకుంటారు. ఇందులో ఎలాంటి తప్పులేదు.. అది అవసరం కూడా. కానీ చిరంజీవి నోట..ప్లీజ్ అన్న మాట రావటం పరిశ్రమ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చిరంజీవిపై ఆచార్య దెబ్బ బాగానే పడింది. దాని తర్వాత వస్తున్న సినిమానే ఇది. అందుకే చిరంజీవి కూడా టెన్షన్ పడుతున్న సూచనలు కన్పిస్తున్నాయి. ఆశించిన స్థాయిలో ఈ సినిమాకు వ్యాపారం జరగకపోవటం..వచ్చిన రెండు పాటలు కూడా పెద్దగా ఆడియెన్స్ కు కనెక్ట్ కాలేదు. దీంతో చిత్ర యూనిట్ లో టెన్షన్ నెలకొంది. గాడ్ ఫాదర్ కూడా పొరపాటున ఎక్కడైనా తేడా కొడితే ఆ ప్రభావం తర్వాత సినిమాలపై కూడా ఉంటుంది. అంతే కాదు..చిరంజీవి సినిమా కెరీర్ పై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. అందుకే అనంతపురం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి రకరకాల ప్రయత్నాలు చేశారు.
దయచేసి (ప్లీజ్) సినిమాను ఆదరించండి అంటూనే..నేనొచ్చా వర్షం వచ్చింది అంటూ సెంటిమెంట్ అస్త్రాన్ని కూడా వాడారు. గతంలో ఇంద్ర సినిమాతోపాటు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు కూడా ఇలాగే వర్షం కురిసింది..ఇది అంతా భగవంతుడి దయ అంటూ వ్యాఖ్యానించారు. తాను పరిశ్రమలోకి వచ్చినప్పుడు తనకు ఎవరూ గాడ్ ఫాదర్ లేరని..మీరే నా గాడ్ పాదర్స్ అంటూ అభిమానులనుద్దేశించి వ్యాఖ్యానించారు. మీ అందరి అండదండలతోనే తాను ఇక్కడ ఉన్నానన్నారు. చిరంజీవి సినిమాలు పలు ఇప్పటికే సెట్స్ పై ఉన్నాయి. గాడ్ ఫాదర్ ఫలితం తేడా వస్తే చిరు సినిమా కెరీర్ కే లెక్కతేడా కొడుతుంది. ఈ కారణంగానే చిరంజీవి రిక్వెస్ట్..సెంటిమెంట్ ల మేళవింపుతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నడిపారంటూ పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అదే సమయంలో చిరంజీవి ఈ తరం ప్రేక్షకులకు కనెక్ట్ కావాలంటే రొటీన్ రొడ్డగొట్టుడు సినిమాలతో సాధ్యం కాదని..ఖచ్చితంగా అందులో ఏదో కొత్తదనం ఉంటే తప్పసాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తన సినిమా గాడ్ పాదర్ తోపాటు నాగార్జున సినిమా ద ఘోస్ట్..స్వాతిముత్యంల కూడా ఆదరించాలని వ్యాఖ్యానించటం ద్వారా పెద్దరికం చూపారనే అభిప్రాయం కూడా ఉంది.