Full Viewగాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈటెంట్ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. బుధవారం రాత్రి అనంతపురంలో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. అదే వేడుకగా ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సినిమా అక్టోబర్ 5న దసరా సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పై చిరంజీవి అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. చిరంజీవి తాజా సినిమా ఆచార్య బాక్సాపీస్ వద్ద చేదు అనుభవం మిగల్చటంతో గాడ్ ఫాదర్ పై అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఇది రాజకీయ కోణంలో ఉన్న సినిమా కావటం..తాజాగా చిరంజీవి విడుదల చేసిన డైలాగ్ చర్చనీయాంశంగా మారింది. ఇది ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే.
రాజకీయాల నుంచి నేను దూరంగా ఉన్నాను..కానీ రాజకీయాలు నా నుంచి దూరం కాలేదు అంటూ చిరంజీవి చెప్పిన డైలాగ్ పెద్ద సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవితోపాటు ప్రముఖ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, సత్యదేవ్, నయనతార, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. మళయాళం సినిమా లూసిఫర్ కు ఇది రీమేక్. ట్రైలర్ చూస్తే సినిమా అంతా రాజకీయం చుట్టూనే తిరుగుతుంది. నేను ఉన్నంత వరకూ ఈ కుర్చీకి చెద పట్టనివ్వను అంటూ చిరంజీవి చెప్పే డైలాగ్ హైలెట్ గా నిలిచింది. ఈ సినిమాలో పార్టీ పేరును జన జాగృతి పార్టీగా..అదీ జనసేన పార్టీ కలర్ లోనే చూపించారు.