డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ కు మరోసారి నిరాశే ఎదురైంది. బుధవారం నాడు ఆర్యన్ బెయిల్ పటిషన్‌ను విచారించిన ముంబయ్ కోర్టు మరోసారి అతడికి బెయిల్ నిరాకరిస్తూ తీర్పునిచ్చింది. గత 14 రోజులుగా ఆర్యన్ ఆర్థర్‌రోడ్ జైలులోనే ఉంటున్న సంగతి తెలిసిందే. ఆర్యన్ బెయిల్‌ను ముంబై కోర్టు తిరస్కరించడం ఇది మూడవ సారి. అంతకు ముందు బెయిల్ దరఖాస్తులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ప్రత్యుత్తరాలను దాఖలు చేస్తుందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అద్వైత్ సేథ్నా జూనియర్ కోర్టుకు తెలియజేశారు.
దీంతో బుధవారం ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై ప్రత్యేక ఎన్‌డిపిఎస్ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ దొరకలేదు. ఆర్యన్ బెయిల్‌ను కోర్టు నిరాకరించింది. విచారణకు ముందు ఆర్యన్‌కు నేడు బెయిల్ దొరకడం ఖాయమని ముంబయ్ సెషన్స్ కోర్టులో సీనియర్ న్యాయవాది మజీద్ మెమన్ ఆశాభావం వ్యక్తం చేశారు. అర్యన్ ఖాన్ అరెస్ట్ అయినప్పటి నుంచి వివాదం సాగుతోంది. తాజాగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కూడా ఈ వ్యవహారంపై స్పందించి..కేంద్ర ఏజెన్సీలు కేజీల డ్రగ్స్ ఉన్న వారిని వదిలేసి..గ్రాములు దొరికిన వారిని పట్టుకుంటోందని ఎద్దేవా చేశారు.