జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన సినిమా హరి హర వీర మల్లు సినిమా విడుదల పనుల్లో బిజీ గా ఉన్నారు. ఈ సినిమా జులై 24 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పవన్ కళ్యాణ్ సోమవారం నాడు హైదరాబాద్ లో ఈ సినిమాకు సంబదించిన పలు అంశాలపై మాట్లాడారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘తర్వాత ఇక సినిమాలు చేస్తానో లేదో నాకు తెలియదు’ అన్నారు. కానీ తనకు ఎంతో ఇష్టమైన నిర్మాత ఏ ఎం రత్నం కోసం మీడియా ముందుకు వచ్చినట్లు వెల్లడించారు. కరోనా తో పాటు తాను రాజకీయాల్లో బిజీ అవటం ఇలా రకరకాల కారణాల వల్ల ఈ సినిమా విషయంలో భారీ జాప్యం జరిగింది అన్నారు. తన ఈ సినిమా కోసం తన బెస్ట్ ఇచ్చాను అని...ఇక ఫలితాన్ని తేల్చాల్సింది ప్రేక్షకులే అన్నారు. ఇప్పుడు హరి హర వీర మల్లు సినిమా విడుదల అవుతుండటంతో పవన్ కళ్యాణ్ పెండింగ్ సినిమాలు ఇంకా రెండు ఉన్నాయి.
ఇందులో ఒకటి ఓజీ. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి కాగా...ఈ మూవీ దసరా సెలవులు టార్గెట్ గా సెప్టెంబర్ 25 న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే పలు మార్లు స్పష్టం చేశారు. దీంతో ఇంకా పూర్తి కావాల్సిన సినిమా ఒక్కటే. అదే హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా షూటింగ్ ను కూడా సాధ్యమైనంత వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు పవన్ కళ్యాణ్. ఇటీవలే ఈ సినిమా లో సెకండ్ హీరోయిన్ గా రాశీ ఖన్నా కూడా సెట్స్ లోకి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. దీంతో పవన్ కళ్యాణ్ చేసే చివరి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ అవుతుందా అన్న అనుమానాలు అయన ఫ్యాన్స్ లో వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి హరి హర వీర మల్లు సినిమా రెండు పార్ట్ లు అని అధికారికంగా ప్రకటించారు. అయితే ఇది ఫస్ట్ పార్ట్ ఫలితంపైనే ఆధారపడి ఉంటుంది అని చెపుతున్నారు.
వాస్తవానికి ఇటీవల వరకు హరి హర వీర మల్లు సినిమా పై అందరిలో కూడా చాలా చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ సినిమాపై ఎక్కువ నెగిటివ్ ప్రచారమే జరిగింది. కాకపోతే ఈ సినిమా ట్రైలర్ విడుదల అయిన తర్వాత ఈ నెగిటివ్ ప్రచారానికి బ్రేక్ పడింది అనే చెప్పాలి. నిర్మాత ఏ ఎం రత్నం ఈ సినిమా విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు ఆయనకు ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర ప్రతిపాదన పెట్టినట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తనకు సినిమాల ప్రమోట్ చేసుకోవటం తెలియదు అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. టాలెంట్ లేకపోతే పరిశ్రమలో ఎవరూ నిలబడలేరు అని... తన కొడుకు అయినా అంతే అన్నారు.